Stag beetle: ఆ పురుగు ఖరీదు రూ.75 లక్షలా..!

ఓ రకమైన చెక్కను తిని జీవించే పురుగు ఖరీదు ఏకంగా రూ.75 లక్షలు. దానికి అంత ధర ఎందుకో తెలుసా..?  

Updated : 07 Jul 2024 19:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘పురుగులా తీసిపారేశారు’ ‘పురుగులా చూశారు’ అనే నానుడిలను వినే ఉంటారు. కానీ, ఇప్పుడు మీరు చదవబోయే పురుగు గురించి తెలిస్తే.. మాత్రం మీ అభిప్రాయం మార్చుకొంటారు. మీరు ఎప్పుడైనా రూ.75లక్షల విలువైన కీటకాన్ని చూశారా..? దాని పేరు ‘స్టాగ్‌ బీటిల్‌’. అత్యంత ఖరీదైన పురుగు. ఎందుకంటే ఇది ఇంట్లో ఉంటే లక్షాధికారి అవుతారని నమ్మకం. దీనిని అదృష్టానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఇది చెక్కలపై ఆధారపడి జీవించే కీటక జాతికి చెందినది. అటవీ పర్యావరణంలో ఇది చాలా ముఖ్య పాత్ర పోషిస్తోంది.

లండన్‌కు చెందిన ‘నేచురల్‌ హిస్టరీ మ్యూజియం’ ప్రకారం ఈ పురుగు బరువు 2-6 గ్రాముల మధ్యలో ఉంటుంది. ఇది దాదాపు 3-7 సంవత్సరాలు జీవిస్తుంది. మగపురుగులు 35-70 మిల్లీమీటర్ల పొడవు, ఆడపురుగులు 30-50 ఎంఎం పొడవు ఉంటాయి. ఈ కీటకాలను చికిత్సల్లోనూ వాడతారు.

ఈ పురుగులకు ఉన్న కొండీలు.. మగ జింకల కొమ్ములను పోలి ఉండటంతో వీటికి ‘స్టాగ్‌ బీటిల్స్‌’ అనే పేరొచ్చింది. ఇవి సంతానోత్పత్తి సమయంలో ఆడపురుగులతో జత కట్టేందుకు ఈ కొండీలను పరస్పరం కొడుతూ విచిత్రమైన చప్పుడు చేస్తాయి.

స్టాగ్‌ బీటిల్స్‌ ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా జీవిస్తాయి. వీటికి చలి పడదు. ఎక్కువగా అడవుల్లో ఉంటాయి.. కొన్ని సందర్భాల్లో తోటలు, పార్కులు వంటి నగర నాగరిక పరిసరాల్లోనూ జీవిస్తాయి. ముఖ్యంగా చనిపోయిన వృక్షాల కలపను నివాసంగా చేసుకొంటాయి.

పెద్ద స్టాగ్‌ బీటిల్స్‌ చెట్ల నుంచి ‘సాప్‌’ అనే ద్రవాన్ని, కుళ్లిన పండ్ల నుంచి కారే తీపి స్రావాలను తిని జీవిస్తాయి. లార్వాదశలో ఇవి తీసుకొన్న ఆహారం నుంచి వచ్చే శక్తిపైనే అధికంగా ఆధారపడతాయి. తొలిదశలో ఇవి కలపను తన పదునైన దవడలతో చీల్చి తింటాయి. ఇవి పచ్చటి మొక్కలకు హాని చేయవు. కేవలం మృత వృక్షాలను మాత్రమే ఆహారంగా తీసుకొంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని