Prince Harry: తాజ్‌మహల్‌ వద్ద ఫొటో వద్దని మేఘన్‌కు చెప్పా.. ఎందుకంటే..!

భారత పర్యటనకు వచ్చిన మేఘన్‌ మార్కెల్‌ను తాజ్‌మహల్‌ ముందు ఫొటో దిగవద్దని చెప్పినట్లు ప్రిన్స్‌హ్యారీ వెల్లడించారు. అందుకు గల కారణాన్ని ప్రిన్స్‌ హ్యారీ తన పుస్తకంలో పొందుపరిచారు. స్పేర్‌ పేరుతో రాసిన ఈ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది.

Published : 10 Jan 2023 21:14 IST

లండన్‌: బ్రిటన్‌ రాజకుటుంబానికి సంబంధించి ప్రిన్స్‌ హ్యారీ (Prince Harry) దంపతులు ఇటీవల పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్‌కు సంబంధించిన విషయాలనూ ప్రిన్స్‌ హ్యారీ (Prince Harry) తన పుస్తకంలో పొందుపరిచారు. ముఖ్యంగా 2017లో మేఘన్‌ మార్కెల్‌ భారత పర్యటన సందర్భంగా ఆమెను తాజ్‌ మహల్‌ (Taj Mahal) ముందు ఫొటో దిగవద్దని సూచించారట. ఈ విషయాన్ని తాను రాసిన ‘స్పేర్‌’ పుస్తకంలో ప్రిన్స్‌ హ్యారీ వెల్లడించారు.

‘జనవరి 2017లో ఓ ఛారిటీ కార్యక్రమంలో భాగంగా ప్రిన్స్‌ హ్యారీ భార్య మేఘన్‌ మార్కెల్‌ భారత్‌లో పర్యటించారు. ఆ సమయంలో పాలరాతి కట్టడమైన తాజ్‌మహల్‌ ముందు ఫొటో దిగవద్దని సూచించా. ఎందుకంటే ఆ అద్భుతమైన కట్టడం వద్ద తన తల్లి (ప్రిన్స్‌ డయానా) కూడా ఫొటో దిగారు. అదెంతో ప్రాచుర్యం పొందింది. దాన్ని చూసిన వారు తన తల్లిని మేఘన్‌ అనుకరిస్తోందని అనుకోవడం ఇష్టం లేదు. అందువల్లే అలా చెప్పా’ అని ప్రిన్స్‌ హ్యారీ పేర్కొన్నారు.

మరోవైపు తన భార్య మేఘన్‌ను బ్రిటన్‌ రాజకుటుంబం ఎంతో వేదనకు గురి చేసిందని ప్రిన్స్‌ హ్యారీ ఆరోపించారు. తన సవతి తల్లి, ప్రస్తుత బ్రిటన్‌ రాణి కెమిల్లా కూడా మేఘన్‌ ప్రతిష్ఠను మసకబరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. 1997లో తన తల్లి డయానా మరణించిన సందర్భంలో తాను పడిన వేదన, తన అన్న ప్రిన్స్‌ విలియంతో ఉన్న విబేధాలతోపాటు రాజ కుటుంబానికి సంబంధించిన విషయాలను తాను రాసిన ‘స్పేర్‌’ పుస్తకంలో ప్రిన్స్‌ హ్యారీ పంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ పుస్తకం మంగళవారం నుంచి ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని