Priyanka Chopra: రండి.. ప్రపంచాన్ని మార్చుకుందాం: ఐరాస వేదికపై ప్రియాంక చోప్రా పిలుపు

సురక్షితమైన, ఆరోగ్యకరమైన, న్యాయమైన ప్రపంచంలో జీవించడం ప్రతి ఒక్కరి హక్కు అని ప్రముఖ బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా జోనస్‌

Updated : 20 Sep 2022 14:03 IST

యునైటెడ్‌ నేషన్స్‌: సురక్షితమైన, ఆరోగ్యకరమైన, న్యాయమైన ప్రపంచంలో జీవించడం ప్రతి ఒక్కరి హక్కు అని ప్రముఖ బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా జోనస్‌ అన్నారు. పరస్పర సహకారంతోనే అది సాధ్యమవుతుందని తెలిపారు. యునిసెఫ్‌ సహృద్భావ రాయబారిగా ఉన్న ప్రియాంక.. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో కీలక ప్రసంగం చేశారు. ప్రస్తుత కఠిన పరిస్థితుల్లో అంతర్జాతీయ సంఘీభావం అత్యంత ముఖ్యమైనదని ఆమె అన్నారు.

‘‘ప్రపంచం పరిస్థితులు అంతగా బాగోలేవు. కొవిడ్ మహమ్మారి వినాశకర ప్రభావం నుంచి బయటపడేందుకు దేశాలు పోరాడుతూనే ఉన్నాయి. పర్యావరణ సంక్షోభం జీవితాలను, జీవనోపాధిని దెబ్బకొడుతూనే ఉంది. ఘర్షణలు, పేదరికం, ఆకలి, అసమానతలు.. మనం సుదీర్ఘకాలంగా పాటుపడుతోన్న న్యాయపూరిత సమాజపు పునాదులను నాశనం చేస్తున్నాయి. ఈ సంక్షోభాలు యాదృచ్ఛికంగా సంభవించలేదు. కానీ, వీటిని మనం పరిష్కరించుకోవచ్చు. అదే ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ప్రణాళిక. 2015లో ఈ ప్రణాళికను మనమే రూపొందించుకుని 15ఏళ్లకు లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ కాలం పరిగెడుతోంది. ఇప్పటికే మన లక్ష్యానికి పెట్టుకున్న గడువులో సగం సమయం గడిచిపోయింది. మిగిలిన ఎనిమిదేళ్లలోనైనా ఈ లక్ష్యాలను సాధించుకోవాలి. మన ప్రపంచాన్ని మార్చుకునే అద్భుత అవకాశం మనకు ఉంది. ఈ భూగ్రహానికి మనమెంతో రుణపడి ఉన్నాం. సురక్షితమైన, ఆరోగ్యకరమైన, న్యాయపరమైన ప్రపంచంలో జీవించే హక్కు మనందరికీ ఉంది. అందుకు కార్యాచరణ అవసరం. ఎందుకంటే అది కేవలం లక్ష్యం మాత్రమే కాదు.. మనందరి నమ్మకం. మనమంతా కలిస్తే ఆ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. మన ప్రపంచ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది’’ అని ప్రియాంక పిలుపునిచ్చారు. 

పేదరికం నిర్మూలించి ప్రతి ఒక్కరి జీవితాలను మెరుగుపర్చడంతో పాటు ఈ భూమండలాన్ని రక్షించుకునేందుకు చేపట్టిన విశ్వ కార్యాచరణే.. ఈ సుస్ధిరాభివృద్ధి లక్ష్యాల ప్రణాళిక. 2015లో ఐరాస సభ్య దేశాలు 17 లక్ష్యాలతో ఈ ప్రణాళికను రూపొందించాయి. 2030 నాటికి ఈ లక్ష్యాలను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

మలాలాతో ప్రియాంక ఫొటో..

ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన చిత్రాలను ప్రియాంక తన సోషల్‌మీడియా ఖాతాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్‌, సామాజిక కార్యకర్త అమండా గోర్మన్‌ తదితరులతో దిగిన ఫొటోలను కూడా నటి షేర్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని