Ukraine Crisis: పౌరుల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం: ఐరాస చీఫ్‌

ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రకటించిన రష్యా.. ఆ దేశంపై క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతోన్న విషయం తెలిసిందే. ఈ పోరులో ఇప్పటివరకు 137 మంది ఉక్రెనియన్లు ప్రాణాలు కోల్పోయారని ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. మృతుల్లో సైనికులు, సాధారణ పౌరులూ ఉన్నారని తెలిపారు...

Published : 25 Feb 2022 14:35 IST

న్యూయార్క్‌: ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రకటించిన రష్యా.. ఆ దేశంపై క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతోన్న విషయం తెలిసిందే. ఈ పోరులో ఇప్పటివరకు 137 మంది ఉక్రెనియన్లు ప్రాణాలు కోల్పోయారని ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. మృతుల్లో సైనికులు, సాధారణ పౌరులూ ఉన్నారని తెలిపారు. ఈ క్రమంలోనే ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ యుద్ధ పరిస్థితులపై శుక్రవారం మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల రక్షణకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ‘పెరుగుతోన్న మరణాలతో.. ఉక్రెయిన్‌లోని ప్రతి మూలలో బాధాకర, భయాందోళనల దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత సమయంలో పౌరుల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి. మానవతా సాయంతోపాటు అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలకు మద్దతుగా నిలవాలి’ అని ట్విటర్‌ వేదికగా పిలుపునిచ్చారు.

అదే విధంగా.. ఉక్రెయిన్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో ఐరాస తరఫున సహాయ కార్యకలాపాలను పెంచుతోన్నట్లు చెప్పారు. ‘ఉక్రెయిన్‌లోని ప్రజలకు అవసరమైన సమయంలో మద్దతు ఇవ్వడానికి, సహాయం చేయడానికి కట్టుబడి ఉన్నాం. ఎవరు, ఎక్కడ ఉన్నారనే దాంతో సంబంధం లేకుండా.. వారి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. గురువారం పుతిన్‌ మిలిటరీ ఆపరేషన్‌ ప్రకటించిన సమయంలోనూ.. దాన్ని నిలిపేయాలంటూ గుటెరస్‌ కోరిన విషయం తెలిసిందే. మానవత్వంతో.. మీ దళాలను రష్యాకు తిరిగి రప్పించాలని ఆ దేశాధ్యక్షుడు పుతిన్‌కు విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. రష్యాకు చెందిన విధ్వంసక బృందాలు రాజధాని నగరం కీవ్‌కు అతి సమీపంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నగరం వెలుపల రష్యా బలగాలను ఎదుర్కొంటున్నట్లు ఉక్రెయిన్‌ సైన్యం వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని