Sri Lanka Crisis: నేవీ స్థావరంలో తలదాచుకున్న మహీంద రాజపక్స..

ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ద్వీప దేశం శ్రీలంక ఇప్పుడు హింసాత్మక ఆందోళనలతో అట్టుడుకుతోంది. ప్రధాని పీఠం నుంచి వైదొలిగిన మహీంద రాజపక్సకు నిరసన సెగ మాత్రం తప్పట్లేదు. ప్రధాని అధికారిక నివాసమైన

Published : 10 May 2022 15:45 IST

కొలంబో వీడిన కుమారుడు నమల్‌

కొలంబో: ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ద్వీప దేశం శ్రీలంక ఇప్పుడు హింసాత్మక ఆందోళనలతో అట్టుడుకుతోంది. ప్రధాని పీఠం నుంచి వైదొలిగిన మహీంద రాజపక్సకు నిరసన సెగ మాత్రం తప్పట్లేదు. ప్రధాని అధికారిక నివాసమైన టెంపుల్‌ ట్రీస్‌ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకారులు గుమిగూడారు. భవనంలోకి చొరబడేందుకు యత్నించారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మహీంద కుటుంబాన్ని ట్రింకోమలిలోని నౌకాదళ స్థావరానికి తరలించినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఈ ఉదయం వేలాది మంది ఆందోళనకారులు మహీంద కుటుంబం నివాసముంటున్న టెంపుల్‌ ట్రీస్‌ వద్దకు చేరుకున్నారు. బారికేడ్లను దాటుకుని భవనానికి అత్యంత సమీపంగా వచ్చారు. కొందు నిరసనకారులు భవనం కాంపౌండ్‌లోకి పెట్రోల్‌ బాంబులు విసిరినట్లు అధికారులు తెలిపారు. కనీసం 10 పెట్రోల్‌ బాంబులతో దాడి చేసినట్లు తెలిపారు. దీంతో భద్రతాసిబ్బంది ఆందోళనకారులపై భాష్పవాయువు ప్రయోగించారు. అనంతరం అత్యంత భద్రత నడుమ సైన్యం మహీంద, ఆయన కుటుంబసభ్యులను నేవీ స్థావరానికి తరలించినట్లు తెలిసింది.

ఈ నేవీ బేస్‌ కొలంబోకు 270 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే అక్కడ కూడా ఆందోళనలు వెల్లువెత్తాయి. ట్రింకోమలి నౌకాదళ స్థావరం వద్ద మహీంద, కొంత మంది కుటుంబసభ్యులు ఉన్నట్లు సమాచారం రాగానే నిరసనకారులు ఈ బేస్‌ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టినట్లు సదరు మీడియా కథనాలు పేర్కొన్నాయి. మరోవైపు మహీంద కుమారుడు నమల్ కుటుంబం కొలంబో వీడి రహస్య ప్రాంతానికి వెళ్లినట్లు మీడియా కథనాల సమాచారం.

దేశవ్యాప్తంగా పెల్లుబికిన ఆందోళనలకు తలొగ్గి మహీంద నిన్న ప్రధాని పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ నిరసన జ్వాలలు ఆగట్లేదు. నిన్న దేశవ్యాప్తంగా పలు చోట్ల మహీంద కేబినెట్‌ మంత్రులతో పాటు పలువురు రాజకీయ నేతల నివాసాలను ఆందోళనకారులు తగలబెట్టారు. హంబన్‌టోటలోని రాజపక్స పూర్వీకుల ఇంటికి నిప్పంటించారు. అక్కడి రాజపక్స మ్యూజియంను ధ్వంసం చేశారు. కరునెగాలలోని మహీంద నివాసాన్నీ దహనం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని