Imran Khan: ఇమ్రాన్‌ ఖాన్‌కు ఊరట.. రెండు వారాల బెయిల్‌ మంజూరు!

అల్‌ ఖాదీర్‌ ట్రస్ట్‌ కేసులో పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు ఇస్లామాబాద్‌ హైకోర్టు శుక్రవారం.. రెండు వారాల బెయిల్‌ మంజూరు చేసింది. ఇదే కేసులో ఇటీవల ఆయన్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ అరెస్టును సుప్రీం కోర్టు.. అక్రమమని ప్రకటించింది.

Published : 12 May 2023 16:24 IST

ఇస్లామాబాద్‌: అల్‌ ఖాదీర్‌ ట్రస్ట్‌ కేసులో పాకిస్థాన్‌ (Pakistan) మాజీ ప్రధాని, తెహ్రీక్‌- ఎ- ఇన్సాఫ్‌(PTI) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan)కు ఊరట లభించింది. ఈ కేసులో ఇస్లామాబాద్‌ హైకోర్టు (IHC) ప్రత్యేక ధర్మాసనం శుక్రవారం ఆయనకు రెండు వారాల బెయిల్‌ మంజూరు చేసింది. అంతకుముందు.. ఇమ్రాన్‌కు సంఘీభావంగా పెద్దఎత్తున అభిమానులు కోర్టు వద్దకు చేరుకున్నారు. భారీ బందోబస్తు మధ్య ఆయన్ను కోర్టులో హాజరుపర్చారు. ఈ క్రమంలోనే ద్విసభ్య ధర్మాసనం ఆయన బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరిపింది. భద్రతా కారణాలతో విచారణ మధ్యలో రెండు గంటలపాటు వాయిదా పడినా.. చివరకు ఆయనకు బెయిల్‌ దక్కింది.

ఇదిలా ఉండగా.. ఇదే కేసులో ఈ కోర్టు ప్రాంగణంలోనే మంగళవారం ఇమ్రాన్‌ ఖాన్‌ను పాక్‌ రేంజర్లు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా ఇమ్రాన్‌ మద్దతుదారులు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు.. ఇమ్రాన్‌ అరెస్టు అక్రమమని ప్రకటించింది. ఆయన్ను విడుదల చేయాలని ఆదేశించింది. దీంతోపాటు ఇస్లామాబాద్‌ హైకోర్టును ఆశ్రయించి.. ఆ న్యాయస్థానం నిర్ణయానికి అనుగుణంగా నడుచుకోవాలని ఇమ్రాన్‌కు సూచించింది. ఈ క్రమంలోనే నేడు ఆయనకు బెయిల్‌ లభించింది. అంతకుముందు.. హింసకు ప్రేరేపించారన్న ఓ కేసులోనూ ఇమ్రాన్‌ ఖాన్‌కు ఇక్కడి ఉగ్రవాద నిరోధక కోర్టు మే 23 వరకు బెయిల్‌ మంజూరు చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని