Pakistan: రణరంగంలా పాక్‌.. ఇమ్రాన్‌ సన్నిహితుడు అరెస్టు

Imran Khan arrest: కొద్దికాలంగా ఆర్థిక ఇక్కట్లు ఎదుర్కొంటోన్న పాక్‌..ఇప్పుడు రాజకీయ అస్థిర పరిస్థితులు చవిచూస్తోంది. దాంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

Updated : 11 May 2023 15:09 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌(Pakistan)లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan) అరెస్టుతో ఆ దేశం భగ్గుమంటోంది. ఈ పరిస్థితుల్లో పీటీఐ పార్టీ నేతల అరెస్టులు ఆగడం లేదు. తాజాగా ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, విదేశాంగశాఖ మాజీ మంత్రి షా మహ్మద్ ఖురేషీని అరెస్టు చేశారు. ఆయన ఇమ్రాన్ ఖాన్‌కు అత్యంత సన్నిహితుడు. ఆయన్ను అదుపులోకి తీసుకున్న దృశ్యాలను పార్టీ ట్విటర్‌లో షేర్ చేసింది. సాధారణ దుస్తుల్లో వచ్చిన కొందరు ఖురేషీని తీసుకెళ్తున్నట్లు అందులో కనిపిస్తోంది. ఇస్లామాబాద్‌ పోలీసులు తమ నేతను అరెస్టు చేసి రహస్య ప్రాంతానికి తరలించారని పార్టీ వర్గాలు తెలిపాయి.

అంతకుముందు ఇమ్రాన్‌ హయాంలో మంత్రిగా పనిచేసిన ఫవాద్ చౌధురీ కూడా అరెస్టయ్యారు. ఈ అరెస్టుల నేపథ్యంలో తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ ఘర్షణలు పాక్‌ చరిత్రలో చీకటి అధ్యాయం అంటూ ఆర్మీ ఖండించింది. నిరసనకారులు ఆర్మీకి చెందిన ఆస్తులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారని, వీటిని తాము ఏమాత్రం సహించబోమని హెచ్చరించింది. ఈ ఉద్రిక్తతల వల్ల ఎనిమిది మంది మరణించగా.. 1900 మందిని అరెస్టు చేశారు. 

పాక్‌లో అనిశ్చితి.. స్పందించిన రిషి సునాక్‌

పాకిస్థాన్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌(Rishi Sunak) స్పందించారు. ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్టు.. ఆ దేశ అంతర్గత వ్యవహారమని వ్యాఖ్యానించారు. అయితే అక్కడి పరిస్థితులను గమనిస్తున్నామని చెప్పారు.

యూఎస్‌ మాజీ దౌత్యవేత్త సంచలన వ్యాఖ్యలు..

అఫ్గానిస్థాన్‌లో దౌత్యవేత్తగా పనిచేసిన జల్మే ఖలీల్జాద్‌.. ఇమ్రాన్‌ అరెస్టును ఖండించారు. ఆయన్ను వెంటనే విడుదల చేయాలన్నారు. కస్టడీలో ఇమ్రాన్‌ను హత్య చేస్తారనే భయాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఇమ్రాన్‌ కూడా న్యాయమూర్తి ముందు ఇదే భయాన్ని వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని