Canada: కెనడాలో ఓ పెళ్లివేడుకలో పంజాబీ గ్యాంగ్‌స్టర్ హత్య..!
కెనడాలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో పంజాబీ గ్యాంగ్‌స్టర్‌ని కాల్చి చంపారు. పట్టపగలే ఈ హత్య చోటుచేసుకుంది.
ఇంటర్నెట్‌డెస్క్: పంజాబ్ మూలాలున్న ఓ గ్యాంగ్‌స్టర్ (Gangster) కెనడా(Canada)లో హత్యకు గురయ్యాడు. ఓ పెళ్లి వేడుకలో పాల్గొని డ్యాన్స్ చేసిన కొద్దిసేపటికే అతడిపై దాడి జరిగింది. కెనడాలో టాప్-10 గ్యాంగ్‌స్టర్లలో ఒకడైన అమర్‌ప్రీత్ సమ్రా అలియాస్ చిక్కీను అతడి ప్రత్యర్థి గ్యాంగ్ ‘బ్రదర్స్ గ్రూప్’ సభ్యులు పట్టపగలే హత్య చేశారు. ఈ ఘటన వాంకోవర్ నగరంలో చోటు చేసుకొంది. ఆ నగరంలోని ‘ఫ్రెష్‌వ్యూ’ హాల్లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో అమర్‌ప్రీత్ తన సోదరుడు రవీందర్‌తో కలిసి పాల్గొన్నాడు. అక్కడ వేదికపై కొద్ది సేపు డ్యాన్స్ చేశాడు.
ఆ తర్వాత కొందరు సాయుధులు అక్కడికి చేరుకొని మ్యూజిక్‌ను ఆపాలని ఆదేశించారు. ఆ సమయంలో అక్కడ దాదాపు 60 మంది అతిథులు ఉన్నారు. ఆ దుండగులు అమర్‌ప్రీత్‌పై కాల్పులు జరిపారు. అతడి వాహనానికి కూడా నిప్పు పెట్టారు. అమర్‌ప్రీత్ వర్గానికి బ్రదర్స్ గ్రూప్ వర్గానికి మధ్య వ్యాపార వ్యవహారాల్లో వైరం ఉంది. దుండగులు అమర్‌ప్రీత్ కోసం ఆ ఫంక్షన్ హాల్లో ముందు నుంచే కాపుకాచి ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ప్రత్యర్థి కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అమర్‌ప్రీత్‌ను కాపాడేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. అతడికి సీపీఆర్ అందించినా.. గాయాల కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. 2022లో కెనడా ప్రభుత్వం.. గ్యాంగ్‌లతో హింసకు పాల్పడుతున్న 11 మంది పేర్లను ప్రకటించింది. వీరిలో 9 మంది పంజాబ్ వాసులే కావడం గమనార్హం. ఈ జాబితాలో అమర్‌ప్రీత్, అతడి సోదరుడు రవీందర్ కూడా ఉన్నారు. వీరికి పలు హత్యలు, కాల్పుల ఘటనలతో సంబంధాలు ఉన్నట్లు బ్రిటిష్ కొలంబియా పోలీసులు వెల్లడించారు. అమర్‌ప్రీత్ యూఎన్ గ్యాంగ్ తరపున పనిచేస్తుంటాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.