Putin: ఏంటీ.. పుతిన్ క్షమాపణలు చెప్పారా..?

జర్మనీ నియంత హిట్లర్‌లో యూదు మూలాలు ఉన్నాయంటూ ఇటీవల రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లవ్రోవ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

Published : 06 May 2022 12:37 IST

టెల్‌అవీవ్‌: జర్మనీ నియంత హిట్లర్‌లో యూదు మూలాలు ఉన్నాయంటూ ఇటీవల రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇవి క్షమించరాని వ్యాఖ్యలంటూ ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, ఇప్పుడు ఈ వివాదం సద్దుమణిగినట్లు కనిపిస్తోంది. ఈ అభ్యంతరక వ్యాఖ్యలపై స్వయంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ క్షమాపణలు చెప్పారని ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ చెప్పారు. 

‘లావ్రోవ్ వ్యాఖ్యలపై పుతిన్‌ చెప్పిన క్షమాపణలను ప్రధాని అంగీకరించారు. యూదు ప్రజల పట్ల, హోలోకాస్ట్ స్మారకం పట్ల తన వైఖరిని స్పష్టం చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలాఉండగా.. ఇజ్రాయెల్ 74 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా క్రెమ్లిన్ విడుదల చేసిన ప్రకటనలో ఈ క్షమాపణల అంశాన్ని ప్రస్తావించలేదు. బెన్నెట్, పుతిన్ మధ్య సంభాషణ జరిగిందని, హోలోకాస్ట్ స్మారకం గురించి వారు చర్చించుకొన్నారని పేర్కొంది. 

ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రారంభమైనప్పటి నుంచి నియో నాజీలను ఆ దేశం నుంచి తరిమి కొడతామని రష్యా చెబుతూ వస్తోంది. అయితే, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. యూదు జాతి వ్యక్తే కావడం గమనార్హం. ఇటీవల దీనిపై లావ్రోవ్‌ ఓ టీవీ ఛానల్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘మేం యూదులం అయినపుడు నాజీ లక్షణాలున్న శక్తులెలా తమ దేశంలో ఉంటాయని వారు అంటున్నారు. కానీ, నా అభిప్రాయం ప్రకారం.. హిట్లర్‌లోనూ యూదు మూలాలు ఉన్నాయి’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ మాటలపై వెంటనే క్షమాపణలు చెప్పాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేసింది. 

ఎర్డోగన్‌తో క్షమాపణ లేఖ రాయించుకున్న పుతిన్‌..

ఉక్రెయిన్ సంక్షోభం వేళ.. ఇజ్రాయెల్ విషయంలో ఒక మెట్టు దిగొచ్చినట్లు కనిపిస్తోన్న పుతిన్‌.. కొన్నేళ్ల క్రితం సాక్షాత్తు ఓ దేశాధ్యక్షుడి చేతే క్షమాపణ లేఖ రాయించారు. అది కూడా టర్కీ నిరంకుశ నేత రెసిప్‌ తయ్యిప్ ఎర్డోగన్‌తో. అసలేం జరిగిందంటే.. 2015లో టర్కీ, సిరియా సరిహద్దు ప్రాంతంలో రష్యాకు చెందిన సు-24 యుద్ధవిమానాన్ని టర్కీకి చెందిన రెండు ఎఫ్‌-16 ఫైటర్ జెట్లు కూల్చివేశాయి. ఆ ఘటనలో ఒక రష్యా పైలట్ మరణించారు. ఆ పైలట్ పారాచుట్ ద్వారా నేలపైకి దిగుతోన్న సమయంలో టర్కీ అనుకూల తిరుగుబాటుదారులు కాల్పులు జరిపారు. దానికి సంబంధించి వీడియో రష్యా టీవీలో ప్రసారమైంది. ఈ ఘటనను రష్యా తీవ్రంగా తీసుకుంది. ఎర్డోగన్ వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్  చేసింది. అలాగే ఆ దేశంపై వరుస ఆంక్షలను విధించింది. క్షమాపణలు విషయంలో రష్యా వైపు నుంచి కొన్ని నెలలపాటు ఒత్తిడి వచ్చింది.

ఈ క్రమంలో 2016లో ఎర్డోగన్‌ పుతిన్‌కు లేఖ రాశారు. ‘ఈ ఘటనలో మరణించిన పైలట్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆ కుటుంబానికి మా క్షమాపణలు. రష్యా విమానాన్ని కూల్చివేయాలనే ఉద్దేశం మాకు లేదు’ అంటూ దానిలో పేర్కొన్నారు. దానిపై టర్కీ ప్రెస్ సెక్రటరీ మాట్లాడుతూ.. ‘ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకునే విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవడానికి రష్యా, టర్కీ అంగీకరించాయి’ అని వెల్లడించారు. యుద్ధవిమానం కూల్చివేత ఘటనలో టర్కీపై రష్యా తీవ్ర ఒత్తిడి పెంచిందని వాషింగ్టన్‌లోని టర్కీష్-అమెరికన్ రాజకీయ విశ్లేషకుడు వెల్లడించారు. ‘2015 ఘటనతో సైనిక, ఇంటిలిజెన్స్, సైబర్ రంగాల్లో టర్కీకి వ్యతిరేకంగా రష్యా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇది ఎర్డోగన్‌ను విపరీతంగా భయపెట్టింది. ఈ సుల్తాన్ ఎన్నటికీ క్షమాపణ చెప్పడని..టర్కీలో జోక్‌ ప్రచారంలో ఉంది. అది నిజమే.. దానికి జార్ మినహాయింపు’ అంటూ అప్పట్లో వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఉక్రెయిన్‌, రష్యాకు మధ్య సంధి కుదిర్చే విషయంలో టర్కీ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు