Putin: ప్రపంచంపై ‘పెత్తనం’ కోసమే అమెరికా ప్రయత్నాలు : పుతిన్‌

ప్రపంచంపై పెత్తనం చెలాయించేందుకు అమెరికా (America) ప్రయత్నాలు చేస్తోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) మరోసారి మండిపడ్డారు.

Published : 17 Aug 2022 02:00 IST

ఏకఛత్రాధిపత్యానికి ఇక ముగింపేనన్న రష్యా అధ్యక్షుడు

మాస్కో: ప్రపంచంపై పెత్తనం చలాయించేందుకు అమెరికా (America) ప్రయత్నాలు చేస్తోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) మరోసారి మండిపడ్డారు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లో శత్రుత్వాన్ని మరింత ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఆఫ్రికా, ఆసియా, లాటిన్‌ అమెరికా దేశాల సైనికాధికారుల సమావేశంలో మాట్లాడిన పుతిన్‌.. ఉక్రెయిన్‌ను (Ukraine Crisis) రష్యా వ్యతిరేక స్థావరంగా అమెరికా మార్చుతున్నందునే అక్కడికి తమ దళాలను పంపామని ఉద్ఘాటించారు.

‘పెత్తనం చలాయించడానికి వారికి (America) ఘర్షణలు కావాలి. అందుకే ఉక్రెయిన్‌ ప్రజలకు ఆయుధాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. ఉక్రెయిన్‌లో పరిస్థితులు చూస్తుంటే ఈ ఘర్షణలను మరింత పొడిగించాలని వారు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాల్లోనూ ఇదే విధంగా వ్యవహరించేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోంది’ అని పుతిన్‌ పేర్కొన్నారు.

ఏకఛత్రాధిపత్యానికి ముగింపే..

తైవాన్‌లో అమెరికా స్పీకర్‌ నాన్సీ పెలోసి పర్యటించడాన్ని ప్రస్తావించిన పుతిన్‌ (Vladimir Putin).. అది ప్రపంచ వ్యాప్తంగా అస్థిరతను రాజేసే ప్రయత్నమేనని ఆరోపించారు. తైవాన్‌లో (Taiwan) ఓ బాధ్యతారహిత రాజకీయ నేత చేసిన పర్యటన.. సాధారణమైనది కాదన్నారు. అక్కడి పరిస్థితులను మరింత క్షీణింపజేసి.. ఆ ప్రాంతంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు సృష్టించేందుకు అమెరికా (America) ఉద్దేశపూర్వకంగా, వ్యూహాత్మకంగానే అలా చేసిందన్నారు. స్వార్థపూరిత ప్రయోజనాల కోసం ఇతర దేశాల సార్వభౌమాధికారాలను గౌరవించకుండా ప్రవర్తిస్తోందని అమెరికా తీరుపై మండిపడ్డారు. ఈ క్రమంలో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రష్యా, చైనా దేశాలపై అమెరికా నిందలు వేస్తోందన్నారు. ప్రపంచంలో ‘ఏకఛత్రాధిపత్య ధోరణి దశ’ ముగింపునకు చేరుకుందని పుతిన్‌ స్పష్టం చేశారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని