Russia: ఉక్రెయిన్‌లో ఎదురుదెబ్బలు.. కీలక మంత్రిపై పుతిన్‌ వేటు!

రష్యా అధ్యక్షుడు పుతిన్‌(Putin) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉప రక్షణశాఖ మంత్రిగా ఉన్న జనరల్‌ దిమిత్రి బుల్గకోవ్‌(Dmitry Bulgakov)ను ఆ పదవినుంచి తొలగించారు. ఆయన స్థానంలో కర్నల్ జనరల్ మిఖాయిల్ మిజింట్సేవ్‌...

Published : 26 Sep 2022 03:48 IST

మాస్కో: ఉక్రెయిన్‌(Ukraine)తో యుద్ధంలో కొన్నాళ్లుగా రష్యా(Russia)కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మెరుపు దాడులతో ఉక్రెయిన్‌ దళాలు మాస్కో సేనలను భారీగా దెబ్బతీస్తున్నాయి. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌(Putin) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉప రక్షణశాఖ మంత్రిగా ఉన్న జనరల్‌ దిమిత్రి బుల్గకోవ్‌(Dmitry Bulgakov)ను ఆ పదవినుంచి తొలగించారు. ఆయన స్థానంలో కర్నల్ జనరల్ మిఖాయిల్ మిజింట్సేవ్‌ (Mikhail Mizintsev)ను నియమించారు. ‘ఆర్మీ జనరల్ దిమిత్రి బుల్గకోవ్ ఉప రక్షణ మంత్రి బాధ్యతల నుంచి రిలీవ్‌ అయ్యారు. ఆయనకు వేరే ఇతర బాధ్యతలు అప్పగిస్తాం’ అని రష్యా రక్షణ మంత్రి టెలిగ్రామ్‌లో చెప్పారు. అయితే, ఆ బాధ్యతలు ఏంటో మాత్రం వెల్లడించలేదు.

జనరల్ బుల్గకోవ్ 2008 నుంచి రష్యా మిలలిటరీ లాజిస్టిక్స్ కార్యకలాపాల నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. అయితే, కొన్నాళ్లుగా ఉక్రెయిన్‌లో రష్యా వెనుకబడిపోయింది. ఇటీవల ఖర్కివ్‌ ప్రాంతంనుంచి మాస్కో సేనలు వెనుదిరిగాయి. లాజిస్టిక్స్ నిర్వహణలో వైఫల్యం కూడా దీనికి ఓ కారణమనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పుతిన్ ఆయనపై చర్యలకు ఉపక్రమించినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు బుల్గకోవ్‌ స్థానంలో వచ్చిన మిజింట్సేవ్‌.. ఉక్రెయిన్‌ ఓడరేవు నగరమైన ‘మేరియుపోల్‌’ విధ్వంసకుడిగా అపకీర్తి మూటగట్టుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో రష్యన్‌ సేనలు ఇక్కడ భారీ విధ్వంసం సృష్టించాయి. ఆర్ట్‌ గ్యాలరీలు, ప్రసూతి ఆసుపత్రులు, థియేటర్లు తేడా లేకుండా సర్వనాశనం చేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని