Putin: చర్చితో సంబంధాలు బలపర్చుకొనే యత్నాల్లో పుతిన్‌..!

రష్యాలోని సంప్రదాయ చర్చి వర్గాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి పుతిన్‌ కీలక నిర్ణయం తీసుకొన్నారు. మరో వైపు ఉక్రెయిన్‌, రష్యా పరస్పరం డ్రోన్‌ దాడులను తీవ్రతరం చేశాయి. 

Published : 02 Jun 2023 14:10 IST

ఇంటర్నెట్‌డెస్క్: ఉక్రెయిన్‌(Ukraine )తో యుద్ధం విషయంలో దేశీయంగా బలమైన మద్దతు దారుగా నిలిచిన చర్చికి రష్యా(Russia) అధ్యక్షుడు పుతిన్‌(Putin) ఓ అపురూపమైన బహుమతి అందించారు. రష్యాలో అత్యంత విలువైన ‘ట్రినిటీ’ పెయింటింగ్‌ను ఆర్థోడాక్స్‌ చర్చికి అప్పగించారు. ముగ్గురు దేవతలున్న ఆర్ట్‌ వర్క్‌ను సుమారు 600 సంవత్సరాల క్రితం చిత్రీకరించారు. ఇప్పటి వరకు దీనిని ట్రెట్యాకోవ్‌ గ్యాలరీలో ఉంచారు. మరోవైపు ఈ అపురూప చిత్రాన్ని చర్చికి అప్పగించడంపై చారిత్రకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం ట్రెట్యాకోవ్‌ గ్యాలరీ  బయట ఉంటే దెబ్బతింటుందని వాదిస్తున్నారు. 

చర్చితో రష్యా ప్రభుత్వం సంబంధాలు బలపర్చుకోవడానికి పుతిన్‌ తాజా నిర్ణయాన్ని చిహ్నంగా చూస్తున్నారు. ఇప్పటికే రష్యా సంప్రదాయ చర్చి బిషప్‌ పాట్రియచ్‌ కిరిల్‌ ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన యుద్ధానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఉక్రెయిన్‌లో చనిపోతే పాపాలన్నీ కడిగేసుకోవచ్చని కూడా ఆయన ప్రకటించారు.

36 క్షిపణులు, డ్రోన్లను కూల్చాం.. : ఉక్రెయిన్‌

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మరింత తీవ్రమవుతున్నాయి. శుక్రవారం ఉదయం పలు నగరాలపై రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. మరోవైపు తమ ఎయిర్‌ డిఫెన్స్ సిస్టమ్‌ మొత్తం 36 డ్రోన్లు లేదా క్షిపణులను కూల్చేసిందని ఉక్రెయిన్‌ పేర్కొంది. వీటిల్లో 15 క్షిపణులు, 21 డ్రోన్లు ఉన్నాయని తెలిపింది. ఉదయం నుంచి దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో సైరన్లు మోగుతూనే ఉన్నాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకు ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు సమాచారం. బాధితుల్లో 11 ఏళ్ల చిన్నారి, 68 ఏళ్ల వృద్ధుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఐదు ఇళ్లు కూలిపోయినట్లు అధికారులు చెప్పారు.

మరోవైపు ఉక్రెయిన్‌ సరిహద్దుల్లోని రష్యా నగరాలపై కూడా ఎడతెరిపిలేకుండా షెల్లింగ్‌ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి ఉక్రెయిన్‌ డ్రోన్లు పశ్చిమ రష్యాలోని కురుస్క్‌పై దాడులు చేసినట్లు ఆ ప్రాంత గవర్నర్‌ రోమన్‌ స్టారోవయిట్‌ పేర్కొన్నారు. ఈ దాడిలో పలు భవనాలు దెబ్బతిన్నాయన్నారు. జరిగిన నష్టాన్ని అంచనావేస్తున్నట్లు వెల్లడించారు. స్మాలెన్స్క్‌ ప్రాంతంలో రెండు చోట్ల దీర్ఘశ్రేణి డ్రోన్లు దాడి చేసినట్లు స్థానిక గవర్నర్‌ పేర్కొన్నారు. దాడి జరిగిన ప్రదేశం ఉక్రయిన్‌ సరిహద్దుకు దాదాపు 270 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని