Putin: ఆ దేశాలు నాటోలో చేరితే మాకు సమస్యేం లేదు.. కానీ!

ఫిన్లాండ్‌, స్వీడన్‌ దేశాలు.. అమెరికా నేతృత్వంలోని సైనిక కూటమి నాటోలో చేరితే తమకెలాంటి సమస్యలు లేవని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. వీటి చేరిక తన దేశానికి ‘తక్షణ ముప్పు’ కలిగించదన్నారు.

Published : 18 May 2022 01:35 IST

మాస్కో: ఫిన్లాండ్‌, స్వీడన్‌ దేశాలు.. అమెరికా నేతృత్వంలోని సైనిక కూటమి నాటోలో చేరితే తమకెలాంటి సమస్యలు లేవని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. వీటి చేరిక తన దేశానికి ‘తక్షణ ముప్పు’ కలిగించదన్నారు. ఇప్పటికే క్లిష్టంగా ఉన్న అంతర్జాతీయ పరిస్థితుల్ని మరింత తీవ్రం చేయడానికి అమెరికా నాటో విస్తరణను దూకుడుగా ఉపయోగిస్తోందని మండిపడ్డారు. నాటోలో చేరేందుకు ముందుకువచ్చిన దేశాల్లో సైనిక సదుపాయాలను పెంపొందిస్తే.. తమ స్పందన చవిచూస్తాయని వార్నింగ్ ఇచ్చారు. ‘మాకొచ్చే బెదిరింపులకు తగ్గట్టే.. మా స్పందన ఉంటుంది. అకారణంగా సమస్యలు సృష్టిస్తున్నారు. వాటికి అనుగుణంగానే మేం ముందుకు వెళ్తాం’ అంటూ పుతిన్‌ను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ వెల్లడించింది.

రష్యాతో 1,300 కిలోమీటర్లకుపైగా సరిహద్దు పంచుకొంటున్న ఫిన్లాండ్‌ నాటోలో చేరతామని తాజాగా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. సైనిక పరంగా కొన్ని దశాబ్దాలుగా తటస్థంగా ఉన్న ఈ దేశం.. ఉక్రెయిన్‌- రష్యా యుద్ధ పరిణామాలతో నాటో వైపు మొగ్గింది. స్వీడన్‌ కూడా అదేబాట పట్టింది. స్వీడన్‌ ప్రధాని మాగ్దలీనా అండర్సన్‌ కూడా తమ దేశం ఈ సైనిక కూటమిలో చేరేందుకు సిద్ధమని ప్రకటించారు. దీనిపై ఇప్పటికే రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్గీ ర్యాబ్‌కోవ్‌ మండిపడ్డారు. ఈ చర్యలు తీవ్ర తప్పిదాలని పేర్కొన్నారు. 

ఇది దీర్ఘకాల పరిణామాలతో కూడిన మరో పెద్ద తప్పిదమని వ్యాఖ్యానించారు. దీంతో సైనిక ఉద్రిక్తతల స్థాయి పెరుగుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయాలనే క్రమంలో.. ఊహాత్మక ఆలోచనలకు వారు తమ ఇంగితజ్ఞానాన్ని పణంగా పెట్టడం శోచనీయమన్నారు. ఈ పరిణామాలతో ఇరుదేశాల మధ్య భద్రత పటిష్ఠం కాదని, రష్యా తగు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. తాము ఇంతటితో సరిపెట్టుకుంటామనే భ్రమల్లో ఉండకూడదంటూ స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని