Putin: రూ.990కోట్ల ఎస్టేట్‌లో.. ప్రేయసితో రహస్యంగా పుతిన్‌ జీవనం..!

రష్యా(Russia) అధ్యక్షుడు పుతిన్‌ గురించి ఆసక్తికర కథనాలు రావడం కొత్తేం కాదు. తాజాగా ఆయన రహస్య జీవనం, ప్రేయసి గురించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. 

Updated : 02 Mar 2023 18:16 IST

మాస్కో: ఉక్రెయిన్‌(Ukraine)పై రష్యా(Russia) సైనిక చర్య ప్రారంభమైన దగ్గరి నుంచి ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ గురించి కొత్త వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆయన తన ప్రేయసి అలీనా కబయేవాతో కలిసి 120 మిలియన్ల డాలర్ల (దాదాపు రూ. 990 కోట్లు) విలువైన ఎస్టేట్‌లో రహస్యంగా నివసిస్తున్నట్లు ఓ వార్తా కథనం వెల్లడించింది. ఇది మాస్కోకు 400కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు పేర్కొంది. ఈ ఎస్టేట్‌లో అనేక భవనాలు ఉన్నాయని, వారి ముగ్గురు పిల్లల కోసం ఓ ప్లేగ్రౌండ్‌ కూడా ఉందని తెలిపింది. రష్యన్ ఇన్వెస్టిగేటివ్‌ న్యూస్ సైట్‌ ది ప్రాజెక్ట్‌ ఈ కథనాన్ని వెలువరించింది. 

జిమ్నాస్ట్‌, ఒలిపింక్స్‌ గోల్డ్‌మెడలిస్ట్‌ అయిన అలీనా కబయేవా.. పుతిన్‌ గర్ల్‌ఫ్రెండ్ అంటూ సుదీర్ఘకాలంగా వార్తలు వస్తున్నాయి. వారికి ముగ్గురు పిల్లలని చెప్తారు. ఇక ఈ ఎస్టేట్ వాల్దాయ్‌ సరస్సుకు దగ్గర్లో ఉంది. సైప్రస్‌ నుంచి వచ్చిన అక్రమ నిధులను ఉపయోగించి ఈ విలాస భవనాన్ని కొనుగోలు చేశారట. 13 వేల చదరపు అడుగుల వైశాల్యంలో దీనిని నిర్మించారని, ఈ భవనంలో బంగారాన్ని కూడా ఉపయోగించినట్లు కొన్ని చిత్రాల ద్వారా తెలుస్తోంది.  ఈ నిధుల నుంచి అలీనాతో పాటు ఆమె బంధువులు కూడా లబ్ధి పొందుతున్నారని పేర్కొంది. అలీనా గ్రాండ్‌ మదర్‌కు కూడా సొంత ఆస్తులు ఉన్నాయట. మాస్కోకు దగ్గర్లో మూడు అంతస్తుల భవనం ఉందని తెలిపింది. ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ బృందం మొదట ఈ ఎస్టేట్ గురించి వెల్లడించింది. బడ్జెట్ నిధులను దీనికి వెచ్చించారని ఆరోపించింది. 

పుతిన్‌(Putin) అండతో రాజకీయాల్లో అడుగుపెట్టిన అలీనా.. యునైటెడ్‌ రష్యా పార్టీకి ప్రాతినిధ్యం వహించారు. ఆరేళ్ల పాటు పార్లమెంట్ సభ్యురాలిగానూ వ్యవహరించారు. నేషనల్‌ మీడియా గ్రూప్‌ డైరెక్టర్ల బోర్డు ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. ఈ కంపెనీకి రష్యాలోని అన్ని ప్రధాన మీడియా సంస్థల్లో మెజార్టీ వాటాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని