Putin: అలాగైతే కాల్పుల విరమణ చేస్తాం: ఉక్రెయిన్‌కు రష్యా ఆఫర్

ఒకవైపు జీ7(G7) దేశాలు చర్చల్లో బిజీగా ఉండగా.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌(Putin) నుంచి కీలక ప్రకటన వచ్చింది. 

Published : 14 Jun 2024 17:39 IST

మాస్కో: గత రెండేళ్లకు పైగా ఎలాంటి ముగింపు లేకుండా ఉక్రెయిన్‌-రష్యా(Ukraine-Russia) యుద్ధం జరుగుతోంది. ఈ తరుణంలో రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin) కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణకు ఆదేశిస్తానంటూ ఉక్రెయిన్‌కు ఆఫర్ ఇచ్చారు. అయితే అందుకు రెండు షరతులు విధించారు.

రష్యా విదేశాంగ శాఖ కార్యాలయంలో పుతిన్‌ మాట్లాడుతూ.. ‘‘మేం వెంటనే కాల్పుల విరమణ చేస్తాం’’ అని అన్నారు. కాల్పుల విరమణకు ఆదేశాలతో పాటు చర్చలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. తమ స్వాధీనంలో ఉన్న నాలుగు ప్రాంతాల్లో బలగాలను ఉపసంహరించుకోవాలని, నాటోలో చేరాలన్న ఆలోచనను విరమించుకోవాలని కీవ్‌కు షరతు విధించారు. తుది పరిష్కారం కోసం ఈ ప్రతిపాదన తెచ్చినట్లు, ఎలాంటి ఆలస్యం లేకుండా చర్చలు ప్రారంభిస్తామని చెప్పారు. అయితే ఒకవైపు జీ7 దేశాలు ఇటలీలో సమావేశమైన తరుణంలో ఈ ప్రకటన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఉక్రెయిన్‌కు చెందిన దొనెట్స్క్‌, లుహాన్స్క్‌, ఖేర్సన్‌, జపోరిజియా ప్రాంతాలు తమ దేశంలో విలీనమైనట్లు గతంలో రష్యా ప్రకటించింది. అయితే, ఈ చర్యను ఉక్రెయిన్‌, పశ్చిమదేశాలు ఖండించాయి. రష్యా దళాలు ఆక్రమించి విలీనం చేసుకున్న ఆ నాలుగు ప్రాంతాలతో పాటు 2014లో స్వాధీనం చేసుకున్న క్రిమియాను కూడా వదిలివెళ్లాలని ఉక్రెయిన్‌ డిమాండ్‌ చేస్తోంది. ప్రస్తుతం నాటోలో చేరే దిశగా అడుగులు వేస్తోన్న తరుణంలో... రష్యా ఇచ్చిన ఆఫర్ ఉక్రెయిన్‌కు రుచించకపోవచ్చు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని