Putin-Kim: పుతిన్‌-కిమ్‌ జోడీ - దాడి చేస్తే దీటుగా స్పందిస్తాం!

పాశ్చాత్య దేశాల నుంచి తమ రెండు దేశాల్లో ఎవరిపై దాడి జరిగినా పరస్పర సహాయం చేసుకుంటామని పుతిన్‌-కిమ్‌ స్పష్టం చేశారు.

Published : 19 Jun 2024 18:47 IST

సియోల్‌: ఉత్తర కొరియా పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Vladimir Putin).. ఆ దేశ నియంత కిమ్‌తో పలు ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. పాశ్చాత్య దేశాల నుంచి తమ రెండు దేశాల్లో ఎవరిపై దాడి జరిగినా పరస్పర సహాయం చేసుకుంటామని స్పష్టం చేశారు. అయితే, ఏ తరహా సహాయం ఉంటుందనే విషయం స్పష్టంగా వెల్లడించనప్పటికీ.. ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’ అని మాత్రమే పేర్కొన్నారు.

ఉక్రెయిన్‌పై దీర్ఘకాలంగా యుద్ధం చేస్తోన్న రష్యాకు.. ఉత్తర కొరియా ఆయుధ సామగ్రిని అందిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదే విషయంపై మాట్లాడిన పుతిన్‌.. ఉత్తర కొరియాతో సైనిక-సాంకేతిక సహకారాన్ని అభివృద్ధి చేసుకునే అంశాన్ని తోసిపుచ్చలేమన్నారు. భద్రత, అంతర్జాతీయ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. ఈ ఒప్పందం శాంతిపూర్వక, రక్షణాత్మక రీతిలో ఉందని కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పేర్కొన్నట్లు రష్యా వార్తా సంస్థ వెల్లడించింది. కొత్త బహుళధ్రువ ప్రపంచాన్ని సృష్టించడంలో ఇది చోదక శక్తిగా మారుతుందనడంలో సందేహం లేదని కిమ్‌ చెప్పినట్లు పేర్కొంది. వీటితోపాటు ఆరోగ్యం, వైద్య విద్య, సైన్స్‌ విభాగాల్లో ఇరు దేశాలు సహాకారం అందించుకునేందుకు వీలుగా పలు ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపింది.

సునాక్‌ నోట ‘స్వదేశీ’ మాట.. ఎన్నికల వేళ ట్రోల్స్‌!

ఓవైపు ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం, మరోవైపు కొరియా సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పుతిన్‌, కిమ్‌ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాకుండా 24ఏళ్లలో తొలిసారిగా ఉత్తర కొరియాలో పుతిన్‌ పర్యటించడం గమనార్హం. ఇలా రెండున్నర దశాబ్దాల్లో తొలిసారి తమ దేశంలో అడుగుపెట్టిన పుతిన్‌కు కిమ్‌ ఘన స్వాగతం పలికారు. కరచాలనం చేస్తూ, ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఎయిర్‌పోర్టు నుంచి భారీ కాన్వాయ్‌తో ఆతిథ్య గృహానికి రష్యా అధ్యక్షుడు బయలుదేరారు. ఈ మార్గంలోని వీధులన్నీ రష్యా జెండాలు, పుతిన్‌ చిత్రాలతో నింపేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని