Putin: త్వరలోనే యుద్ధాన్ని మెరుగ్గా ముగిస్తాం..: పుతిన్‌ ప్రకటన

ఉక్రెయిన్‌పై యుద్ధం ముగింపు విషయంలో పుతిన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మెరుగైన ఫలితాలతోనే ఈ సంక్షోభాన్ని ముగిస్తామని చెప్పారు.  

Published : 23 Dec 2022 11:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని వేగంగా ముగించాలనుకుంటున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించారు. మాస్కోలో విలేకర్లతో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ సంక్షోభాన్ని ముగించడమే మా లక్ష్యం. మేము ఇందుకోసం కష్టపడుతున్నాం. యుద్ధం ముగింపు దశకు వచ్చిందని నిర్ధారించుకోవడానికి యత్నిస్తున్నాం. దీనిని త్వరలోనే మెరుగ్గా ముగిస్తాం. ప్రతి సంక్షోభం ఏదో రకంగానో, చర్చలతోనే ముగుస్తుంది. ఈ విషయాన్ని కీవ్‌లోని మా శత్రువులు అర్థం చేసుకోవాలి. అదే వారికి మంచిదవుతుంది’’ అని పరోక్షంగా ఉక్రెయిన్‌ను హెచ్చరించారు.

ఉక్రెయిన్‌కు పేట్రియాట్‌ వ్యవస్థలను అమెరికా సమకూర్చడం, జెలెన్‌స్కీ పర్యటనపై పుతిన్‌ స్పందిస్తూ..‘‘మాతో తలపడుతున్న వారికి చెబుతున్నాను. అదో రక్షణాత్మక ఆయుధం. దానికి విరుగుడు ఉంటుంది. ఇది సంక్షోభాన్ని మొత్తానికి మరింత సాగదీస్తుంది’’ అని పుతిన్‌ పేర్కొన్నారు.

రష్యా ఆర్మీచీప్‌ వాలేరి గెరిస్మోవ్‌ మాట్లాడుతూ దొనెట్స్క్‌కు పూర్తిగా స్వేచ్ఛ కల్పించడంపై దృష్టిపెట్టామన్నారు. ఈ ప్రాంతంలో  విద్యుత్తు, రవాణా వంటి మౌలిక సదుపాయాలు ఇక్కడ దెబ్బతింటున్నాయని అన్నారు.

విదేశీ పర్యటనలో భాగంగా తొలిసారి అమెరికా వెళ్లిన జెలెన్‌స్కీకి అక్కడ అపూర్వ స్వాగతం లభించింది. ఆయన అమెరికాకు వెళ్లడానికి కొన్ని గంటల ముందే దాదాపు 1.8 బిలియన్‌ డాలర్ల విలువైన సైనిక ఉత్పత్తులను ఉక్రెయిన్‌కు అందించేందుకు అగ్రరాజ్యం ముందుకొచ్చింది. అంతేకాకుండా క్షిపణి దాడులను సైతం తట్టుకునేందుకు వీలుగా పేట్రియాట్‌ క్షిపణి రక్షణ వ్యవస్థలు అందిస్తామని స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌కు అన్ని విధాలా అండగా ఉంటామని అమెరికా భరోసా ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని