Putin: ఉక్రెయిన్‌పై రష్యా పోరు.. పుతిన్‌ ‘ప్రేయసి’పై ఈయూ ఆంక్షలు..!

ఉక్రెయిన్‌పై భీకర దండయాత్ర సాగిస్తోన్న రష్యాను నిలువరించేందుకు ప్రపంచ దేశాలు ఆంక్షల కొరఢా ఝుళిపిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా సహా ఐరోపా సమాఖ్య(ఈయూ)

Updated : 07 May 2022 16:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌పై భీకర దండయాత్ర సాగిస్తోన్న రష్యాను నిలువరించేందుకు ప్రపంచ దేశాలు ఆంక్షల కొరఢా ఝుళిపిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా సహా ఐరోపా సమాఖ్య(ఈయూ) రష్యాపై పలు ఆంక్షలు అమల్లోకి తెచ్చాయి. తాజాగా ఈయూ ఆరో ఆంక్షల ప్యాకేజీని ప్రతిపాదించింది. కాగా.. ఈ కొత్త జాబితాలో పుతిన్‌ ప్రియురాలిగా భావిస్తోన్న అలీనా కబయేవా పేరు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

తాజా ఆంక్షల జాబితాను ఈయూ ఎగ్జిక్యూటివ్‌ సభ్య దేశాలకు అందించారు. ఈ జాబితాను ఐరోపా సమాఖ్యలోని 27 దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాల్సి ఉంటుంది. అదే జరిగితే, అలీనా కబయేవా ఈయూలో అడుగుపెట్టకుండా ఆమెపై నిషేధం విధిస్తారు. దీంతో పాటు ఆమె ఆస్తులను కూడా స్తంభింపజేసే అవకాశముంటుంది. 

జిమ్నాస్ట్, ఒలింపిక్స్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ అయిన అలీనాకు పుతిన్‌కు అత్యంత సన్నిహిత సంబంధాలున్నట్లు గత కొన్నేళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరి ‘బంధం’ గురించి 2008లో తొలిసారిగా వార్తలు వచ్చాయి. అయితే పుతిన్‌ మాత్రం అలీనాను తన ప్రేయసిగా ఎన్నడూ అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం ఆమె తన సంతానంతో స్విట్జర్లాండ్‌లోని ఓ లగ్జరీ విల్లాలో అత్యంత భద్రత నడుమ ఉంటున్నట్లు సమాచారం. రష్యా అధ్యక్షుడే వారిని స్వయంగా అక్కడకు పంపించినట్లు తెలుస్తోంది.

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైన నాటి నుంచి అలీనా పేరు వార్తల్లో వినిపిస్తూనే ఉంది. ఆమెను స్విట్జర్లాండ్‌ నుంచి బహిష్కరించాలంటూ ఇటీవల పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపించాయి.

ఎవరీ అలీనా కబయేవా..

ఉజ్బెకిస్థాన్‌లో పుట్టిన అలీనా జిమ్నాస్ట్‌, మోడల్‌, గాయని, రాజకీయ నాయకురాలు కూడా. 2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించారు. ఇది కాకుండా 14 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పతకాలు, 21 యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌ పతకాలు గెలుచుకున్నారు. క్రీడాకారులతో పుతిన్‌ జరిపిన ఓ కార్యక్రమంలో రష్యా అధ్యక్షుడితో అలీనాకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది సన్నిహిత బంధంగా మారినట్లు సమాచారం. పుతిన్‌ అండతో రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆమె.. యునైటెడ్‌ రష్యా పార్టీకి ప్రాతినిధ్యం వహించారు. ఆరేళ్ల పాటు పార్లమెంట్ సభ్యురాలిగానూ వ్యవహరించారు. ప్రస్తుతం నేషనల్‌ మీడియా గ్రూప్‌ డైరెక్టర్ల బోర్డు ఛైర్‌పర్సన్‌గా గత ఏడేళ్లుగా పనిచేస్తున్నారు. ఈ కంపెనీకి రష్యాలోని అన్ని ప్రధాన మీడియా సంస్థల్లో మెజార్టీ వాటాలున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు