Boris Johnson: బోరిస్‌.. క్షిపణి వేసేందుకు ఒక్క నిమిషం చాలు..! పుతిన్‌ హెచ్చరిక

గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ కొనసాగుతోంది. ఈ క్రమంలో యుద్ధానికి ముందు పుతిన్‌(Putin)కూ తనకూ మధ్య జరిగిన సంభాషణను బోరిస్‌ జాన్సన్‌ వెల్లడించారు. 

Published : 30 Jan 2023 11:29 IST

లండన్‌: బ్రిటన్‌ మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌(Boris Johnson) రష్యా అధ్యక్షుడు పుతిన్‌(Putin) గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకొని క్షిపణి ప్రయోగం చేస్తానని బెదిరించినట్లు వెల్లడించారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభించడానికి ముందు తనకు ఫోన్‌లో ఈ హెచ్చరిక చేసినట్లు చెప్పారు. జాన్సన్‌ను ఉటంకిస్తూ.. ‘పుతిన్‌ వర్సెస్‌ ది వెస్ట్‌’(Putin v the West) పేరిట మూడు భాగాలుగా తీసిన బీబీసీ డాక్యుమెంటరీ ఈ విషయాన్ని వెల్లడించింది.

యుద్ధానికి ముందు ఒకానొక సమయంలో పుతిన్‌(Putin) తనపై బెదిరింపులకు దిగాడని యూకే మాజీ ప్రధాని వెల్లడించారు. ‘బోరిస్‌.. నేను నిన్ను ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదు. కానీ క్షిపణితో దాడి చేసేందుకు ఒక్క నిమిషం చాలు’ అంటూ హెచ్చరించాడని తెలిపారు. పుతిన్ వ్యాఖ్యలకు తాను బెదిరిపోలేదని, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి మద్దతు ఇవ్వడానికే మొగ్గుచూపానని చెప్పారు. అలాగే ఉక్రెయిన్‌..  తక్షణమే నాటోలో చేరదని చెప్పడానికి తాను ఎంతో బాధపడ్డానన్నారు.

పుతిన్‌: బోరిస్‌..ఈ క్షణమే  ఉక్రెయిన్‌ నాటోలో చేరదని మీరు చెప్తున్నారు. ఈ క్షణమే అంటే అర్థం ఏంటి..?

బోరిస్‌: సమీప భవిష్యత్తులో ఉక్రెయిన్‌ నాటోలో చేరబోదు. ఆ విషయం మీకు బాగా తెలుసు.. 

ఈ డాక్యుమెంటరీలో జెలెన్‌స్కీ కూడా దర్శనమిచ్చారు. ఆయన తన నాటో ఆశయానికి వచ్చిన అడ్డంకుల గురించి వివరించారు. రష్యా దురాక్రమణను అడ్డుకునే అవకాశాన్ని ఇవ్వమని కోరుకోవడమూ కనిపిస్తోంది. ‘మీరు నాకు ఆ అవకాశం ఇవ్వకపోతే.. మీరే దాన్ని ఆపండి’ అంటూ యుద్ధం గురించి నాటో దేశాలకు వెల్లడించారు. 

నాటో (నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌) ఒక సైనిక కూటమి. దానిలో ఉక్రెయిన్‌ చేరడానికి ఇష్టంలేని మాస్కో గత ఏడాది ఫిబ్రవరిలో ఆ దేశంపై సైనిక చర్య ప్రారంభించింది. ఆ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని