Putin: అమెరికాను కలసికట్టుగా ఎదుర్కొంటాం.. కిమ్‌తో భేటీకి ముందు పుతిన్‌

Putin: పుతిన్‌ మంగళ, బుధవారాలలో ఉత్తర కొరియాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీకి ఓ వ్యాసం రాస్తూ పలు కీలక విషయాలను ప్రస్తావించారు.

Updated : 18 Jun 2024 09:03 IST

సియోల్‌: ఉక్రెయిన్‌తో యుద్ధంలో ఉత్తర కొరియా తమకు మద్దతుగా నిలుస్తోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Putin) వెల్లడించారు. అందుకు ఆ దేశ అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ను ప్రశంసించారు. ఈ మేరకు ఆయన ‘కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ’కి వ్యాసం రాశారు. పుతిన్‌ మంగళ, బుధవారాలలో ఉత్తర కొరియాలో పర్యటించనున్నారు.

అనేక విషయాల్లో ఇరు దేశాలు పరస్పర సహకారంతో ముందుకెళ్తున్నాయని పుతిన్‌ (Vladimir Putin) వెల్లడించారు. అందుకు ఐరాసలో అనుసరిస్తున్న ఉమ్మడి వైఖరిని ఉదహరించారు. తాజా పర్యటనతో ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింత ఉన్నతస్థాయికి చేరుతుందని ఆకాంక్షించారు. అమెరికా విధించిన ఆంక్షలను కలిసికట్టుగా ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ దేశాల ప్రభావం పడకుండా చెల్లింపుల వ్యవస్థలను సైతం అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. పర్యటకం, సంస్కృతి, విద్య రంగాల్లోనూ సహకారాన్ని బలోపేతం చేస్తామన్నారు.

ఈ పర్యటనలో ఇరు దేశాధినేతలు పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉందని రష్యన్‌ ఏజెన్సీలు వెల్లడించాయి. భద్రత, రక్షణకు సంబంధించిన ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం’ కూడా అందులో ఒకటని పేర్కొన్నాయి. ప్రధానంగా రక్షణపరమైన సహకారంపైనే ఇరు దేశాల ఒప్పందాలు ఉండనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అణ్వాయుధాల అభివృద్ధి నేపథ్యంలో ఉత్తర కొరియాపై, ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యాపై అమెరికా కఠిన ఆర్థికపరమైన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

ప్రయోగానికి సిద్ధంగా 2,100 అణ్వాయుధాలు

ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు ఉత్తర కొరియా ఆయుధాలు సరఫరా చేస్తోందని పాశ్చాత్య దేశాలు భగ్గుమంటున్న విషయం తెలిసిందే. బాంబులు, క్షిపణులు సహా ఇతర సైనిక వ్యవస్థలను అందజేస్తోందని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. తద్వారా యుద్ధం సుదీర్ఘంగా కొనసాగేలా చేస్తోందని ఆరోపించాయి. ఈ వాదనలను ఇటు రష్యా, అటు ఉత్తర కొరియా ఖండిస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలో పుతిన్‌ తాజా పర్యటన, ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

పుతిన్‌ ఉత్తర కొరియా రావడం 24 ఏళ్లలో ఇదే మొదటిసారి. 2000 సంవత్సరం జులైలో పుతిన్‌ మొదటిసారి ఉత్తర కొరియా వెళ్లి, నాటి అధ్యక్షుడైన కిమ్‌ తండ్రితో సమావేశమయ్యారు. అమెరికా నుంచి సవాళ్లు పెరుగుతున్నందున, వాటిని ఎదుర్కోవడానికి సైనిక సహకారాన్ని వృద్ధి చేసుకోవాలని రష్యా, ఉత్తర కొరియాలు భావిస్తున్నాయి. ఈ విషయమై పుతిన్, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌లు చర్చలు జరుపుతారు.

పుతిన్‌ పర్యటనపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాలధినేతలు సమావేశం కావడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. కానీ, వారి మధ్య బలపడుతున్న బంధమే ఆందోళన కలిగిస్తోందని అగ్రరాజ్య భద్రతా మండలి ప్రతినిధి జాన్‌ కిర్బీ అన్నారు. ఇది కొరియా ద్వీపకల్పం సహా ప్రాంతీయంగా తీవ్ర అస్థిర పరిస్థితులకు దారితీసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని