Putin-Kim: వెళ్లొస్తా మరి.. విమానం నుంచి కిమ్‌కు పుతిన్‌ బైబై..!

ఉత్తర కొరియా(North Korea) పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌(Putin), కిమ్(Kim) అత్యంత ఆత్మీయంగా కనిపించారు. దీనికి సంబంధించి ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. 

Published : 22 Jun 2024 10:32 IST

ప్యాంగ్‌యాంగ్‌: పశ్చిమ దేశాలతో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్‌(Putin).. ఉత్తర కొరియాలో పర్యటించడం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఈ పర్యటనలో కిమ్, పుతిన్‌ల మధ్య ఉన్న స్నేహం మీడియా దృష్టిని ఆకర్షించింది. దీనికి సంబంధించి తాజాగా ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. ఆత్మీయులకు వీడ్కోలు పలుకుతున్నట్టుగా వారిద్దరూ బైబై అంటూ చేతులు ఊపడం ఆకట్టుకుంటోంది.

ఈ బుధవారం తెల్లవారుజామున పుతిన్‌.. ఉత్తరకొరియా వచ్చారు. తమ రెండు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా కీలక ఒప్పందాలు చేసుకున్నారు. రెండు దేశాల్లో దేనిపైనైనా శత్రువు దాడి జరిపితే పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నారు. సుమారు 10 గంటలపాటు ఆ దేశంలో ఉన్న రష్యా అధ్యక్షుడు కొద్దిసేపు కిమ్‌తో కలిసి సరదాగా గడిపారు. తాను బహుమతిగా ఇచ్చిన కారులోనే ఇద్దరూ కలిసి డ్రైవ్‌కు వెళ్లారు. గుర్రానికి క్యారెట్లు తినిపించారు. గార్డెన్‌లో కలిసి నడిచారు. కిమ్‌ కొన్ని రిటర్న్‌ గిఫ్ట్‌లు అందించారు. తర్వాత పుతిన్‌ ప్రైవేట్‌ జెట్ వద్దకు వెళ్లి మరీ కిమ్‌ వీడ్కోలు పలికారు. బయటనుంచి ఉ.కొరియా అధ్యక్షుడు చేతులు ఊపుతుంటే.. లోపల నుంచి పుతిన్‌ కూడా బైబై చెప్పారు. అది ఇద్దరు నేతల మధ్య అనుబంధాన్ని చూపించింది. ఇప్పుడు ఈ దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

గత ఫిబ్రవరిలో కిమ్‌ మాస్కో పర్యటనకు వెళ్లారు. ఆయన ఆహ్వానం మేరకు 24 ఏళ్ల తర్వాత ఉ.కొరియాలో పుతిన్ పర్యటించారు. ఈసందర్భంగా కిమ్‌కు తమ దేశంలో అత్యంత విలాసవంతమైన ఆరస్‌ లగ్జరీ కారును బహూకరించారు. ఫిబ్రవరి నెలలోనూ ఇటువంటి కారునే అందించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు