Published : 28 Jun 2022 02:07 IST

Putin: ఆ సమయంలో.. పుతిన్‌ కాన్వాయ్‌ ఎందుకు వెళ్లింది..?

క్రెమ్లిన్‌ చేరుకున్న కొన్ని గంటలకే కీవ్‌పై క్షిపణి దాడులు

కీవ్‌: గత నాలుగు నెలలుగా ఉక్రెయిన్‌పై (Ukraine crisis) యుద్ధాన్ని కొనసాగిస్తోన్న రష్యా.. తాజాగా కీవ్‌పై క్షిపణి దాడులకు ఉపక్రమించింది. ఇదే సమయంలో రష్యా అధ్యక్ష భవనం వద్ద ఓ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాత్రి 11 గంటల సమయంలో పుతిన్‌ (Putin) కాన్వాయ్‌ అత్యవసరంగా క్రెమ్లిన్‌ (అధ్యక్ష కార్యాలయం) చేరుకోవడం పలు ఊహాగానాలకు తావిచ్చింది. ఏదైనా ముఖ్యమైన ప్రకటన చేస్తారా అనే కోణంలోనూ వార్తలు వెలువడ్డాయి. కానీ, అలా చేరుకున్న కొన్ని గంటలకే ఉక్రెయిన్‌ రాజధానిపై క్షిపణి దాడులు మొదలుకావడం మరోసారి చర్చనీయాంశమయ్యింది.

సెంట్రల్‌ మాస్కోలోని రష్యా అధ్యక్ష భవనం వద్ద శనివారం రోజున హడావుడి నెలకొంది. రాత్రి 11 గంటల సమయంలో పుతిన్‌కు చెందిన భారీ వాహన కాన్వాయ్‌ అక్కడకు చేరుకుంది. వీటికి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘సాధారణంగా రాత్రి వేళల్లో అత్యవసరం అయితే తప్ప పుతిన్‌ అక్కడికి వచ్చే అవకాశం ఉండదు. అణ్వస్త్ర క్షిపణుల విషయంపై బెలారస్‌ అధ్యక్షుడితో చర్చిస్తోన్న సమయంలో ఇటువంటి పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏదైనా అతిముఖ్యమైన ప్రకటన ఉండవచ్చు’ అంటూ మీడియాలో కథనాలు వెల్లడించాయి. అంతేకాకుండా ఆ సమయంలో పుతిన్‌ క్రెమ్లిన్‌కు ఎందుకు వెళ్లినట్లు..? అంటూ సోషల్‌ మీడియాలో యూజర్లు అనుమానాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు.

ఇలా పుతిన్‌ కాన్వాయ్‌ అత్యవసరంగా క్రెమ్లిన్‌కు చేరుకున్న విషయం చర్చనీయాంశం కావడంతో అధ్యక్ష భవనం స్పందించింది. ఏదో అత్యవసర ప్రకటన చేయడానికే క్రెమ్లిన్‌కు చేరుకున్నట్లు మీడియాలో వస్తోన్న ఊహాగానాలను కొట్టిపడేస్తూ.. అవన్నీ అవాస్తవాలేననంటూ అధ్యక్ష కార్యాలయం స్పష్టం చేసింది. కానీ, అలా ప్రకటన చేసి కొన్ని గంటలకే (ఆదివారం తెల్లవారుజామున) కీవ్‌ నగరంపైకి 14 క్షిపణులను రష్యా సేనలు ప్రయోగించాయి. ఆ ఘటనలో రెండు భవనాలు నేలమట్టంకాగా నలుగురు గాయపడ్డారు. దీంతో గత కొన్నివారాలుగా దాడుల బారినుంచి ఉపశమనం పొందిన ఉక్రెయిన్‌ రాజధానికి మళ్లీ క్షిపణుల భయం పట్టుకుంది.

ఇదిలాఉంటే, రాబోయే కొన్ని నెలల్లో అణ్వాయుధ సామర్థ్యమున్న క్షిపణులను బెలారస్‌కు అందించనున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించారు. పుతిన్‌తో బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకో శనివారం రష్యాలో భేటీ అయ్యారు. అదే రాత్రి క్రెమ్లిన్‌ వద్ద హడావుడి నెలకొనడంతో ఉక్రెయిన్‌ యుద్ధంపై పుతిన్‌ అత్యవసరంగా ఏదైనా ప్రకటన చేస్తారా అనే ఊహాగానాలు వెలువడ్డాయి.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని