Putin: పుతిన్‌ అణు బెదిరింపుల మర్మం ఏమిటీ..!

ఐరోపా ఖండంపై అణుముప్పు ముసిరింది. అమెరికా కూడా పూర్తిగా అప్రమత్తమైంది. వాస్తవానికి ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముందు నుంచే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అణ్వాయుధాల జపం చేస్తున్నారు. ఒక దశలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు

Updated : 27 Sep 2022 11:44 IST

ఎలక్ట్రోమాగ్నటిక్‌ పల్స్‌ దాడిపై అనుమానాలు

ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం

ఐరోపా ఖండంపై అణుముప్పు ముసిరింది. అమెరికా కూడా పూర్తిగా అప్రమత్తమైంది. వాస్తవానికి ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముందు నుంచే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అణ్వాయుధాల జపం చేస్తున్నారు. ఒక దశలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానియేల్‌ మేక్రాన్‌ ముఖం మీదే వీటి ప్రస్తావన తీసుకొచ్చారు. కానీ, అప్పట్లో రష్యా విజయం నల్లేరుపై నడక వంటిదే అనుకొని అణ్వాయుధ ప్రయోగాన్ని అందరూ తేలిగ్గా తీసుకొన్నారు. కానీ, ఆరు నెలలు పూర్తైనా రష్యాకు విజయం దక్కలేదు. నాటో సహకారంతో ఉక్రెయిన్‌ సేనలు ఇప్పుడు ఎదురుదాడులు మొదలుపెట్టాయి. మరోవైపు మాస్కో ఆర్థిక, ఆయుధ పరిస్థితి దిగజారడంతో పాటు మిత్రదేశాల నుంచి ఒత్తిళ్లు కూడా పెరిగిపోయాయి. ప్రతికూల పరిస్థితులు మొదలయ్యాయని పుతిన్‌ గ్రహించారు. గత వారం సైనిక దళాలను సమీకరిస్తామని చెబుతూనే పశ్చిమదేశాలు అణుబెదిరింపులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. తమ వద్ద అణ్వాయుధాలున్నాయనీ.. వాటిని రష్యా రక్షణకు నిస్సంకోచంగా వాడతామని పేర్కొన్నారు.  దీంతో ఆక్రమిత ప్రాంతాలను రష్యాలో విలీనం చేసే రెఫరెండం ప్రక్రియ మొదలుపెట్టారు. అది నేటితో పూర్తవుతుంది. అది పూర్తయితే ఆ భూభాగాలను స్వాధీనం చేసుకోవడానికి ఉక్రెయిన్‌ చేసే దాడి.. రష్యా సార్వభౌమత్వానికి ముప్పుగా పరిగణిస్తారు. అప్పుడు అణ్వాయుధాలు వాడే అవకాశం ఉంటుందని పశ్చిమ దేశాలు అనుమానిస్తున్నాయి.

ఎలాంటి అణ్వాయుధాలంటే..

ఫెడరేషన్‌ ఆఫ్‌ అమెరికన్‌ సైంటిస్ట్స్‌ లెక్కల ప్రకారం రష్యా వద్ద మొత్తం 4,477 అణ్వాయుధాలు ఉన్నాయి. వీటిల్లో 1,900లు ‘నాన్‌-స్ట్రాటజిక్‌’ వర్గానికి చెందినవి. వీటినే టాక్టికల్‌ అణ్వాయుధాలు అంటారు. సాధారణ అణ్వాయుధాలకు, వీటికి మధ్య కొంత తేడా ఉంది. వీటిని పరిమితమైన యుద్ధ క్షేత్రంలో వాడటానికి మాత్రమే అవకాశం ఉంటుంది. అంటే భూమిపై యుద్ధ ట్యాంకుల సమూహం, సముద్రంలో ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌ బ్యాటిల్‌ గ్రూప్‌ వంటి వాటిని లక్ష్యంగా చేసుకోవచ్చు. వీటికి 10 కిలో టన్నుల శక్తి నుంచి 100 కిలో టన్నుల డైనమెట్లు పేల్చినంత శక్తి ఉంటుంది. ఇవి చిన్నవని చెబుతుంటారు.. వాస్తవానికి  జపాన్‌పై అమెరికా ప్రయోగించిన బాంబులకు శక్తి కేవలం 15 కిలో టన్నుల నుంచి 21 కిలో టన్నులు మాత్రమే. అమెరికా ప్రభుత్వ ఆర్కైవ్స్‌ ప్రకారం ఈ బాంబులు పేలిన వెంటనే అత్యధికంగా 70 వేల మంది ప్రాణాలను హరించాయి. అంటే వీటికంటే రష్యా టాక్టికల్‌ అణుబాంబుల శక్తి చాలా ఎక్కువన్నమాట. ఇక రష్యా వద్ద ఉన్న స్ట్రాటజిక్‌ శ్రేణి వార్‌ హెడ్‌లకు 500 కిలో టన్నుల నుంచి 800 కిలోటన్నుల శక్తి  ఉంటుంది. వీటితో పట్టణాలనే ధ్వంసం చేయవచ్చు. 

లక్ష్యమే కీలకం..

అణ్వాయుధ ముప్పును కేవలం బాంబుల శక్తితోనే చూడకూడదు. వాటిని ప్రయోగించే లక్ష్యాల ఆధారంగా చూడాలి. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌ నైతిక స్థైర్యం దెబ్బతీయడం, భయోత్పాతాలు సృష్టించడమే లక్ష్యంగా హిరోషిమా, నాగసాకి వంటి జనావాసాలపై అమెరికా 15 కిలోటన్నుల శక్తి ఉన్న అణుబాంబులు వేసింది. అవి సృష్టించిన బీభత్సం మనకు తెలిసిందే. వాస్తవానికి టాక్టికల్‌ అణు బాంబులంటూ ఏమీ ఉండవని అమెరికా మాజీ రక్షణ మంత్రి జేమ్స్‌ మాటీస్‌ వెల్లడించారు. పరిస్థితి పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకోవడానికి వీటిని వాడతారని పేర్కొన్నారు.

ఉక్రెయిన్‌ విద్యుత్తు, ఇతర కమ్యూనికేషన్‌ వ్యవస్థలను దెబ్బతీసేలా భారీగా ఎలక్ట్రో మాగ్నటిక్ తరంగాలను సృష్టించేలా అణ్వాయుధాన్ని వాడే అవకాశం ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి. భారీగా మరణాలు ఉండకుండా చూసేందుకు ఉక్రెయిన్‌ నీటిపై గానీ, లేదా ఆకాశంలో నిర్ణీత ఎత్తులో కూడా అణు పేలుడుకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి. ఇలా చేస్తే.. ఆ పేలుడు నుంచి వెలువడే ఎలక్ట్రో మాగ్నటిక్‌ పల్స్‌ ఉక్రెయిన్‌ పరికరాలను ధ్వంసం చేస్తాయి. ‘ప్రాజెక్టు కె నూక్లియర్‌ పరీక్ష’ పేరిట 1962లో సోవియట్‌ ప్రభుత్వం కజకిస్థాన్‌ గగనతలంపై ఈ ఆయుధాలను విజయవంతంగా పరీక్షించింది.

రష్యా వాడితే పరిస్థితి ఏమిటీ..

భారీ ఓటమిని తప్పించుకోవడానికి ముందుగానే చిన్న అణ్వాయుధాలను వాడేలా నాయకులు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. అదే పెద్ద అణ్వాయుధాలు వాడితే ప్రత్యర్థుల నుంచి ప్రతిదాడికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. గత వారం పుతిన్‌ హెచ్చరికలపై ‘ది ఇంటర్నేషనల్‌ క్యాంపెయిన్‌ టు అబాలిష్‌ నూక్లియర్‌ వెపన్స్‌’ (ఐసీఏఎన్‌) అంచనా ప్రకారం ఐరోపాలో అణుపేలుడు.. జపాన్‌పై అణుదాడి కంటే తీవ్ర పరిణమాలను సృష్టిస్తుంది. వేల మంది పౌరుల ప్రాణాలను ఇది బలికొంటుందని ఆ సంస్థ అంచనావేసింది. పలు దేశాలు రేడియేషన్‌ ప్రభావం కిందకు వస్తాయని వెల్లడించింది.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని