FIFA World Cup 2022: స్టేడియాల నిర్మాణ సమయంలో బలైన కార్మికుల సంఖ్య 500!

ఫిఫా ప్రపంచ కప్‌ 2022 క్రీడలు ఖతార్‌లో ఘనంగా జరుగుతున్నాయి. అయితే, ఈ అత్యాధునిక స్టేడియాల నిర్మాణ సమయంలో సుమారు 400 నుంచి 500 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు ఖతార్‌ అధికారి  ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Published : 30 Nov 2022 01:34 IST

దోహా: ఖతార్‌లో జరుగుతోన్న ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ పోటీల కోసం దేశవ్యాప్తంగా ఐదు నగరాల్లో ప్రత్యేక స్టేడియాలు నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే, వీటి నిర్మాణం క్రమంలో ఎంతో మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారంటూ వార్తలు వచ్చాయి. ఈ సంఖ్య సుమారు 400 నుంచి 500 మధ్య ఉండవచ్చని ప్రపంచ కప్‌ నిర్వహణతో సంబంధమున్న ఓ ఖతార్‌ ఉన్నతాధికారి వెల్లడించారు. కేవలం పదుల సంఖ్యలో మాత్రమే చనిపోయారని ప్రభుత్వ లెక్కలు చెబుతుండగా.. తాజాగా సదరు అధికారి వెల్లడించిన మృతుల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం. 

ఖతార్‌ స్టేడియాల నిర్మాణంపై వచ్చిన ఆరోపణలు, క్రీడల నిర్వహణకు సంబంధించి ఖతార్‌ సుప్రీం కమిటీ సెక్రటరీ జనరల్‌ హసన్‌ అల్‌-థవాడీ ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. స్టేడియాల నిర్మాణ క్రమంలో ఎంత మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారనే ప్రశ్నకు సమాధానమిచ్చిన ఆయన.. కచ్చితమైన సంఖ్య లేనప్పటికీ సుమారు 400 నుంచి 500 వరకు ఉండవచ్చని సమాధానమిచ్చారు. ఇప్పటివరకు ఖతార్‌ అధికారులు వెల్లడించిన గణాంకాల కంటే ఇది చాలా ఎక్కువ.

ఖతార్‌కు ఫిఫా ప్రపంచ కప్‌-2022 నిర్వహణ 2010లో ఖరారయ్యింది. ఇందుకోసం 2014 నుంచి 2021 వరకు స్టేడియాలు, వేదికలు, మౌలిక సదుపాయాల నిర్మాణాలను చేపట్టింది. ఈ క్రమంలో మొత్తం 40 మంది కార్మికులు మాత్రమే చనిపోయినట్లు వెల్లడించింది. అందులో 37మంది ఖతార్‌కు చెందినవారేనని తెలిపింది. పని ఒత్తిడి, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, మౌలిక వసతుల లేమి వంటి కారణాలతో చాలా మంది కార్మికులు మరణించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన ఖతార్‌.. వలస కార్మికుల వేతనాలు, కఫాలా వ్యవస్థ రద్దు వంటి కీలక నిర్ణయాలు తీసుకుంది. మరోవైపు అరబ్‌ దేశాల్లో పనిచేసే కార్మికుల్లో భారత్‌, పాకిస్థాన్‌, శ్రీలంక దేశాలకు చెందినవారే అధికంగా ఉంటున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని