Published : 03 Mar 2022 13:56 IST

QUAD: ఉక్రెయిన్‌ సంక్షోభం వేళ.. భేటీకి సిద్ధమైన ‘క్వాడ్‌’ కూటమి!

తాజా పరిణామాలపై చర్చించనున్న అగ్రదేశాలు

దిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. అమెరికా, పశ్చిమ దేశాలు ఇప్పటికే రష్యాపై ఆంక్షలు విధించే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌, భారత్‌తో ఏర్పడిన కీలక కూటమి ‘క్వాడ్‌(QUAD)’ సమావేశం కానుంది. వర్చువల్‌గా జరిగే ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్‌ మారిసన్‌, జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదాతో పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నట్లు భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బగ్చీ వెల్లడించారు. ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు జరుపుతోన్న వేళ ‘క్వాడ్‌’ దేశాధినేతలు సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న దండయాత్రను ఇప్పటికే క్వాడ్‌(QUAD)లో భాగస్వాములుగా ఉన్న అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ దేశాలు ఖండించాయి. ఇలాంటి విపత్కర సమయంలో ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తామని ప్రకటించడంతో బాధిత దేశానికి మద్దతుగా నిలుస్తున్నాయి. ఇదే సమయంలో భారత్‌ మాత్రం తటస్థ వైఖరిని అనుసరిస్తోంది. రష్యాకు వ్యతిరేకంగా ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రవేశపెట్టిన తీర్మాన ఓటింగ్‌కూ భారత్‌ దూరంగా ఉంది. ఐరాస వేదికగా ఇప్పటివరకు మూడుసార్లు జరిగిన ఓటింగ్‌కు దూరంగా ఉన్న నేపథ్యంలో భారత్‌ ఓ స్పష్టమైన వైఖరి అనుసరించాల్సి ఉందని అగ్రరాజ్యం భావిస్తోంది. తాజాగా క్వాడ్‌ సదస్సులో ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇదిలాఉంటే, ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని నిలువరించడానికి భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లు ‘క్వాడ్‌’గా ఏర్పడిన విషయం తెలిసిందే. నాలుగు అగ్ర దేశాలతో ఏర్పడ్డ ఈ కూటమి అధినేతలు గతేడాది సెప్టెంబర్‌ 24న వాషింగ్టన్‌లో తొలిసారి భేటీ అయ్యారు. ఆ సమయంలో కొవిడ్‌, పర్యావరణ మార్పులు, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో ఎదురవుతున్న సవాళ్లు సహా పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా చైనా దూకుడు కట్టడి చేసే వ్యూహాలపైనా చర్చలు జరిపారు. తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో ఈ కూటమి భేటీ కావడం మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది.

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts