Antibodies: టీకా తీసుకున్న 6 నెలల తర్వాత కూడా రక్షణే..!

వ్యాక్సిన్‌ తీసుకున్న ఆరు నెలల తర్వాత కూడా కొవిడ్‌-19కు కారణమయ్యే వైరస్‌ను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్‌లు మెరుగైన పనితీరు కనబరుస్తున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.

Published : 17 Feb 2022 05:59 IST

నాణ్యమైన యాంటీబాడీలు దోహదం చేస్తున్నాయన్న తాజా అధ్యయనం

వాషింగ్టన్‌: యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారిని ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌లు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇదే సమయంలో వ్యాక్సిన్‌ల నుంచి పొందిన యాంటీబాడీలు కొన్ని నెలలకే క్షీణిస్తాయనే వార్తలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అయినప్పటికీ వ్యాక్సిన్‌ తీసుకున్న ఆరు నెలల తర్వాత కూడా కొవిడ్‌-19కు కారణమయ్యే వైరస్‌ను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్‌లు మెరుగైన పనితీరు కనబరుస్తున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా యాంటీబాడీల సంఖ్య తగ్గినప్పటికీ.. వాటి నాణ్యత వల్ల కొవిడ్‌ను ఎదుర్కొనే సామర్థ్యం అలాగే కొనసాగుతోందని స్పష్టం చేసింది.

వ్యాక్సిన్‌ల పనితీరును తెలుసుకునేందుకు అమెరికాకు చెందిన వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు ఇటీవల ఓ అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా ఫైజర్‌ వ్యాక్సిన్‌ వాస్తవ ఫలితాలను విశ్లేషించారు. వ్యాక్సిన్‌ తీసుకున్న కొన్ని నెలల తర్వాత యాంటీబాడీల స్థాయి క్షీణిస్తున్నప్పటికీ రోగనిరోధక ప్రతిస్పందనలు మాత్రం స్థిరంగా ఉంటున్నట్లు గమనించారు. అంతేకాకుండా వైరస్‌ ఎటువంటి మార్పులకు గురికానంత వరకు ఈ తక్కువ యాంటీబాడీలు కూడా ఆశించిన మేరకు రక్షణ కల్పిస్తున్నట్లు గుర్తించారు. ఇలా వ్యాక్సిన్‌ రెండో డోసు తీసుకున్న 6 నెలల తర్వాత కూడా చాలా మందిలో యాంటీబాడీలు మెరుగుగా ఉంటాయనే విషయం ఊహించలేదని వాషింగ్టన్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధనకర్త అలీ ఎల్లెబెడీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

పరిశోధనలో భాగంగా వ్యాక్సిన్‌ తీసుకున్న వారి నుంచి రక్తనమూనాలు, లింఫోనోడ్‌లతో పాటు ఎముక మజ్జను కూడా తీసుకొని పరీక్షించారు. వాటిలో యాంటీబాడీలను ఉత్పత్తి చేసే బీ కణాలు కొన్ని నెలలపాటు ఉంటున్నట్లు గుర్తించారు. వ్యాక్సిన్‌ తీసుకున్న మొదట్లో కంటే 6 నెలల తర్వాతే మెరుగైన యాంటీబాడీలు ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు. తద్వారా ఎక్కువ సంఖ్యలో యాంటీబాడీలు ఉండడం ఒక్కటే ముఖ్యం కాదని.. వాటి సంఖ్య తగ్గినప్పటికీ అవి ఎంతో రోగనిరోధకత కలిగి ఉన్నాయని చెప్పారు. ప్రమాదకరమైన కొత్త వేరియంట్‌ వస్తే తప్ప వీటితో పూర్తి రక్షణ ఉంటుందని భరోసా ఇస్తున్నారు. వీటికి సంబంధించిన తాజా నివేదిక జర్నల్‌ నేచర్‌లో ప్రచురితమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని