Australia: కనిపించకుండాపోయిన ‘రేడియోధార్మిక’ క్యాప్సూల్‌.. 1400 కి.మీల మేర వెతుకులాట!

కనిపించకుండా పోయిన ఓ చిన్నపాటి క్యాప్సూల్‌.. ఆస్ట్రేలియాలో అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. ఎందుకంటే.. అందులో రేడియోధార్మిక పదార్థం ‘సీజియం‌- 137’ ఉండటమే.

Published : 28 Jan 2023 20:30 IST

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా(Australia)లో కనిపించకుండా పోయిన ఓ చిన్న క్యాప్సూల్‌.. అక్కడి అధికారులను హడలెత్తిస్తోంది! కారణం.. అందులో రేడియో ధార్మికత పదార్థం ‘సీజియం‌- 137(Caesium-137)’ ఉండటమే. రేడియేషన్‌(Radiation) నేపథ్యంలో ఆ గుళికను తాకడం లేదా దగ్గర ఉంచుకోవడం తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుందని, కాలిన గాయాలవుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటువంటి వస్తువు ఏదైనా కనిపిస్తే దూరంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు.

6 మి.మీల వ్యాసం, 8 మి.మీల పొడవు గల ఈ క్యాప్సూల్‌ను ఇటీవల ఓ ట్రక్కులో పశ్చిమ ఆస్ట్రేలియా న్యూమన్‌ ఉత్తర ప్రాంతంలోని ఓ సైట్ నుంచి పెర్త్‌కు రవాణా చేస్తుండగా.. మార్గమధ్యలో ఎక్కడో పడిపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మొత్తం 1400 కి.మీల మేర వెతుకులాట కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా.. సీజియం‌- 137ను మైనింగ్ కార్యకలాపాల్లో వినియోగిస్తారు.

ఈ గుళిక రేడియేషన్‌ను విడుదల చేస్తుందని.. దీంతో దాన్ని తాకిన, లేదా వెంట ఉంచుకున్న వారికి కాలిన గాయాలు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని అగ్నిమాపక, అత్యవసర సేవల విభాగం హెచ్చరించింది. ఆ క్యాప్సూల్‌ ఫొటోను విడుదల చేసింది. ఎవరికైనా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని, ఒకవేళ ఎవరైనా తీసుకుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని డీఎఫ్‌ఈఎస్‌ సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని