Sri Lanka Crisis: ‘లంకాదహనం’.. రాజపక్స పూర్వీకుల ఇంటికి నిప్పు..!

ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ద్వీపదేశం శ్రీలంక (Sri Lanka)లో హింసాకాండ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పెల్లుబికిన ఆందోళనలకు తలొగ్గి ఎట్టకేలకు మహీంద రాజపక్స (Mahinda Rajapaksa) తన ప్రధానమంత్రి

Updated : 10 May 2022 10:29 IST

మహీందను అరెస్టు చేయాలని డిమాండ్లు..

సైన్యం అధీనంలో అధ్యక్షుడి నివాసం

మంటల్లో కాలిపోతున్న రాజపక్స పూర్వీకుల నివాసం

కొలంబో: ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ద్వీపదేశం శ్రీలంక (Sri Lanka)లో హింసాకాండ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పెల్లుబికిన ఆందోళనలకు తలొగ్గి ఎట్టకేలకు మహీంద రాజపక్స (Mahinda Rajapaksa) తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే మహీంద రాజీనామా చేసిన కొద్ది గంటలకే హంబన్‌టోటలోని రాజపక్స పూర్వీకుల ఇంటికి నిరసనకారులు నిప్పు పెట్టారు. అక్కడి రాజపక్స మ్యూజియంను ధ్వంసం చేశారు. మ్యూజియంలోని రాజపక్స కుటుంబీకుల మైనపు విగ్రహాలను విరగొట్టారు. దీంతో పాటు మహీంద కేబినెట్‌లో ఉన్న పలువురు మంత్రుల నివాసాలను ఆందోళనకారులు తగలబెట్టారు.

అటు కొలంబోలోని ప్రధాని అధికారిక నివాసమైన టెంపుల్‌ ట్రీస్‌ ముందు సోమవారం ఉద్రిక్త ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులు ప్రధాని ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. భాష్పవాయువు ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అత్యంత భద్రత నడుమ మహీందను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది.

అధ్యక్షుడి నివాసం ముట్టడికి యత్నం..

మరోవైపు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స (Gotabaya Rajapaksa) నివాసం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. మంగళవారం ఉదయం గొటబాయ నివాసాన్ని ముట్టడించేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. అధ్యక్షుడి ఇంటికి అత్యంత సమీపంలోకి వచ్చేందుకు యత్నించగా.. సైన్యం వారిని అడ్డుకుంది. ప్రస్తుతం గొటబాయ నివాసం వద్ద భారీగా సైన్యం మోహరించింది.

మహీందను అరెస్టు చేయాల్సిందే..

ఇదిలా ఉండగా.. హింసకు కారణమైన మాజీ ప్రధాని మహీందను అరెస్టు చేయాల్సిందేనని ప్రతిపక్ష రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తున్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తోన్న నిరసనకారులపైన ప్రభుత్వం దాడులు చేయించిందని.. ఫలితంగానే ఈ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని వారు ఆరోపించారు. ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు ఓ ఎంపీ సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 200 మందికి పైగా గాయపడ్డారు. మహీందను తక్షణమే అరెస్టు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మరోవైపు, మహీంద రాజీనామాతో కేబినెట్‌ కూడా రద్దయింది. దీంతో మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అధ్యక్షుడు గొటబాయ చర్యలు చేపట్టారు. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తక్షణమే పార్లమెంట్‌ సమావేశపర్చాలని ప్రతిపక్షాలు అధ్యక్షుడిని కోరాయి.

కర్ఫ్యూ పొడిగింపు..

ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరడంతో నిన్న శ్రీలంక వ్యాప్తంగా కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. ఆ కర్ఫ్యూను బుధవారం వరకు పొడిగిస్తూ నిన్న అర్ధరాత్రి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత అత్యయిక పరిస్థితుల్లో ఆందోళనకారులను అరెస్టు చేసేలా పోలీసులు, భద్రతా బలగాలకు ప్రత్యేక అధికారాలిచ్చారు. ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని ఆర్మీ చీఫ్‌ జనరల్ శావేంద్ర సిల్వా కోరారు. శాంతిభద్రతలను పరిరక్షించేందుకు ఎలాంటి చర్యలైనా చేపడతామన్నారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని