Ram Chandra Paudel: తొలగిన అనిశ్చితి.. నేపాల్‌ అధ్యక్షుడిగా రామచంద్ర పౌడెల్‌

నేపాల్‌ అధ్యక్షుడిగా రామచంద్ర పౌడెల్‌ ఎన్నికయ్యారు. ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్‌ బలపరిచిన ఆయనకు అధికార ప్రచండ నేతృత్వంలోని ప్రభుత్వం మద్దతు తెలిపింది.

Published : 09 Mar 2023 23:54 IST

కాఠ్‌మాండూ: నేపాల్‌ (Nepal) అధ్యక్షుడు ఎవరన్న దానిపై అనిశ్చితి తొలగింది. ఇవాళ నిర్వహించిన ఎన్నికల్లో ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్‌ (ఎన్‌సీ) ప్రతిపాదించిన అభ్యర్థి రామచంద్ర పౌడెల్ (Ram Chandra Paudel) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మొత్తం 52,628 ఓట్లకు గానూ ఆయన 33, 802 ఓట్లు సాధించారు. పీపీఎన్‌-యూఎంఎల్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థి సుబాశ్‌ నెంబాంగ్‌ 15,518 ఓట్లు సాధించారు. నేషనల్‌ అసెంబ్లీలోని సభ్యులతోపాటు, 8 ప్రావెన్షియల్‌ అసెంబ్లీలకు చెందిన సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నేషనల్‌ అసెంబ్లీ సభ్యుడి ఓటు విలువ 79 గానూ, ప్రావెన్షియల్‌ అసెంబ్లీ సభ్యుడి ఓటు విలువను 48గా నిర్ధారించారు. మొత్తం 881 మందికిగానూ 831 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధ్యక్ష ఎన్నికల నిర్వహణ అధికారి అమృత భండారీ పేర్కొన్నారు.

అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలోనే నేపాల్‌ రాజకీయాల్లో ప్రకంపనలు ఏర్పడ్డాయి. రాజకీయ ప్రకరణల నేపథ్యంలో ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్‌ (ఎన్‌సీ) అభ్యర్థి రామచంద్ర ఫౌడెల్‌కు మద్దతివ్వాలని ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్‌ నిర్ణయించింది. కానీ, ఇది సీపీఎన్‌-యూఎంఎల్‌కు ఏమాత్రం నచ్చలేదు. అధ్యక్ష ఎన్నికల్లో తమ అభ్యర్థిని బలపరుస్తామంటూ రెండు నెలల క్రితం ఇచ్చిన మాటను ప్రచండ నిలబెట్టుకోలేదని ఓలీ వర్గం ఆరోపించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. అంతేకాకుండా తమ పార్టీ అభ్యర్థిగా సుబాశ్‌ నెంబాంగ్‌ను నిలబెట్టింది. ప్రభుత్వంలో తమ పార్టీ నుంచి ఉప ప్రధాని సహా 8 మంది మంత్రులు ఉన్నారు. వారందరూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు