Canada: కెనడాలో మరో హిందూ దేవాలయానికి అపచారం.. ఖండించిన భారత్‌!

కెనడా (Canada)లో హిందూ దేవాయాలయాలపై అపచార ఘటనలు కొనసాగుతున్నాయి. గత నెలలో గౌరీ శంకర్‌ మందిరంపై దాడి చేసిన దుండగులు, తాజాగా మిస్సిసాగా(Mississauga)లోని రామ మందిరంపై విద్వేషపూరిత నినాదాలు రాశారు.

Published : 15 Feb 2023 23:08 IST

టొరంటో: కెనడా (Canada)లో మరో హిందూ దేవాలయానికి అపచారం జరిగింది. కొందరు దుండగులు మిస్సిసాగా(Mississauga)లోని రామాలయంపై విద్వేషపూరిత నినాదాలు రాశారు. ఈ ఘటనను కెనడాలోని భారత రాయబార కార్యాలయం (India in Toronto) తీవ్రంగా ఖండించింది. ‘‘మిస్సిసాగాలోని రామ మందిరంపై భారత్‌కు వ్యతిరేకంగా విద్వేషపూరిత నినాదాలతో గ్రాఫిటీ చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కెనడా ప్రభుత్వాన్ని కోరాం’’ అని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. కెనడాలో హిందూ దేవాలయాలపై జాతి విద్వేషపూరిత దాడి జరగడం ఇది తొలిసారేం కాదు. గతంలోనూ ఇలాంటి అపచార ఘటనలు చోటుచేసుకున్న ఉదంతాలు ఉన్నాయి. 

గత నెలలో కెనడాలోని బ్రాంప్టన్‌ (Brampton) నగరంలో గౌరీ శంకర్‌ మందిరంలో కూడా భారత్‌కు వ్యతిరేకంగా గ్రాఫిటీని చేశారు. అప్పట్లో ఈ ఘటనను  భారత రాయబార కార్యాలయం ఖండించింది. అలాగే, గతేడాది సెప్టెంబరులో బీఏపీఎస్‌ స్వామి నారాయణ్‌ మందిరంపైనా కెనడా ఖలిస్థానీ తీవ్రవాదులు (Canadian Khalistani Extremists) భారత వ్యతిరేక నినాదాలు రాశారు. అంతకముందు రిచ్‌మండ్ హిల్‌లో మహాత్మా గాంధీ విగ్రహంపై కూడా ఖలిస్థానీ వేర్పాటువాదులు దాడి చేశారు. ఈ వరుస ఘటనలపై భారత రాయబార కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు కెనడాలోని భారతీయుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కెనడా ప్రభుత్వాన్ని కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని