Updated : 12 May 2022 20:47 IST

Sri Lanka PM: శ్రీలంక నూతన ప్రధానిగా రణిల్‌ విక్రమ సింఘే

ప్రమాణ స్వీకారం చేయించిన అధ్యక్షుడు గొటబాయ

కొలంబో: తీవ్ర సంక్షోభంతో కల్లోలమవుతోన్న శ్రీలంక రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నూతన ప్రధానమంత్రిగా రణిల్‌ విక్రమ సింఘే (73) బాధ్యతలు చేపట్టారు. యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ) నేత రణిల్ విక్రమ సింఘే ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినట్లు అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. దీంతో మరో వారంలోనే నూతన కేబినెట్‌ను ఏర్పాటు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి.

తీవ్ర ఆందోళనలతో అట్టుడుకుతోన్న శ్రీలంకలో నిరసన జ్వాలల దెబ్బకు ప్రధానమంత్రి మహింద రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం దేశాన్ని సంక్షోభాల నుంచి గట్టెక్కించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోన్న అధ్యక్షుడు గొటబాయ రాజపక్స.. సీనియర్‌ నేత విక్రమ సింఘేను ప్రధానమంత్రిగా నియమించేందుకు మొగ్గుచూపారు. బుధవారం నాడు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన గొటబాయ.. పార్లమెంట్‌లో మెజార్టీ, ప్రజల విశ్వాసం పొందిన కొత్త ప్రధాని పేరును ప్రకటిస్తానని వెల్లడించారు. ఈ క్రమంలోనే మాజీ ప్రధాని విక్రమ సింఘేతో చర్చలు జరిపిన అనంతరం దేశ ప్రధానిగా ఆయనకు పగ్గాలు అప్పజెప్పారు. మరోవైపు అధ్యక్ష అధికారాలను తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నానన్న గొటబాయ రాజపక్స.. కొత్త మంత్రివర్గంలో తమ కుటుంబీకులెవరూ ఉండబోరని హామీ ఇచ్చారు.

రణిల్‌ విక్రమ సింఘే.. ఐదోసారి ప్రధాని బాధ్యతల్లోకి..

యూనైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ)కి చెందిన రణిల్‌ విక్రమ సింఘే శ్రీలంకకు పలు దఫాల్లో ఇప్పటివరకు మొత్తం నాలుగుసార్లు ప్రధానమంత్రిగా సేవలందించారు. తాజాగా అధ్యక్షుడు గొటబాయ సూచన మేరకు శ్రీలంక ప్రధానిగా ఐదోసారి ప్రమాణస్వీకారం చేశారు. 2018లో అధ్యక్షుడిగా ఉన్న మైత్రిపాల సిరిసేన ఆయనను ప్రధానమంత్రి పదవి నుంచి తప్పించినప్పటికీ తిరిగి రెండు నెలలకే మళ్లీ ప్రధాని పగ్గాలు చేపట్టారు. దేశంలో పురాతనమైన పార్టీగా యూఎన్‌పీకి పేరున్నప్పటికీ క్రితం (2020) సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం కేవలం ఒక్క సీటు కూడా గెలువలేకపోయింది. అయితే, మొత్తం ఓట్ల ఆధారంగా ఆ పార్టీకి కేటాయించిన ఒక సీటుతో విక్రమ సింఘే పార్లమెంటుకు ఎన్నికయ్యారు.

ఇదివరకు నాలుగుసార్లు ప్రధానిగా, ఆయా ప్రభుత్వాల్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రణిల్‌కు దూరదృష్టి గల విధానాలతో ఆర్థిక వ్యవస్థను సమర్థంగా నిర్వహించగలరనే పేరుంది. అంతేకాకుండా అంతర్జాతీయ సహకారాన్ని పొందడంలోనూ చతురత కనబరిచే నేతగానూ ప్రజామోదం ఉంది. దీంతో ప్రస్తుతం సంక్షోభ పరిస్థితుల్లో అధికార పార్టీ ఎస్‌ఎల్‌పీపీ, ప్రతిపక్ష ఎస్‌జేబీకి చెందిన కొందరితోపాటు ఇతర పార్టీల సభ్యులు విక్రమ సింఘేకు మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం. దీంతో ఐదోసారి శ్రీలంక పగ్గాలను చేపట్టిన నేతగా విక్రమ సింఘే కీర్తి సొంతం చేసుకున్నారు.

విక్రమసింఘే గురించి మరిన్ని..

* 73 ఏళ్ల రణిల్‌ విక్రమ సింఘే గత 45ఏళ్లుగా పార్లమెంట్‌ సభ్యుడిగా కొనసాగుతున్నారు

* వివిధ దేశాలతో మంచి సంబంధాలు ఉండడంతో అంతర్జాతీయ వ్యవహారాల్లో సమర్థ నేతగా పేరు తెచ్చుకున్నారు.

* న్యాయవాది అయిన విక్రమ సింఘే.. 1977లో తొలిసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ద్వీపదేశం శ్రీలంక రాజకీయాల్లోనే అత్యంత కీలక వ్యక్తిగా కొనసాగుతున్నారు.

* 1993లో తొలిసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన రణిల్‌.. వివిధ ప్రభుత్వాల్లో పలు మంత్రిత్వశాఖకు నేతృత్వం వహించారు.

* 1993 నుంచి 1994, 2001-2004, 2015-18, 2018-19లో మొత్తం నాలుగు దఫాల్లో ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

* నాయకత్వ సంక్షోభంతో 2020లో తన పార్టీలో చీలిక రావడంతో రణిల్‌ పార్టీ రెండుగా విడిపోయింది. అనంతరం యూఎన్‌పీ అధినేతగా రణిల్‌ కొనసాగుతున్నారు. 

* 2018లో అప్పటి అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో వచ్చిన విబేధాలు విక్రమ సింఘే ప్రతిష్ఠను దెబ్బతీశాయి. అదే సమయంలో 2019లో ఈస్టర్‌ రోజున జరిగిన దాడిలో 260మంది ప్రాణాలు కోల్పోవడం రణిల్‌ ప్రభుత్వానికి మరింత ప్రతికూలంగా మారింది. 2020లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విక్రమ సింఘే పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది.

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts