Pakistan: శత్రువుతో యుద్ధానికి సిద్ధమే : పాక్‌ ఆర్మీ చీఫ్‌ కీలక వ్యాఖ్యలు

పాకిస్థాన్‌ నూతన ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన జనరల్‌ అసీమ్‌ మునీర్‌ ఎల్‌ఓసీలో పర్యటించారు. ఈ సందర్బంగా భారత్‌ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Published : 04 Dec 2022 14:19 IST

ఇస్లామాబాద్‌: తమ దేశంపై ఎవరైనా దాడి చేస్తే.. ప్రతి ఇంచు భూమిని రక్షించుకోవడమే కాకుండా శత్రుదేశంపై దాడి చేస్తామని పాకిస్థాన్‌ నూతన ఆర్మీ చీఫ్ జనరల్‌ అసీమ్‌ మునీర్‌ పేర్కొన్నారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి నియంత్రణ రేఖలోని (Line of Control) రాఖ్‌చిక్రీ సెక్టార్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి సైనికులు, ఉన్నతాధికారులతో మాట్లాడిన ఆయన భారత్‌ను ఉద్దేశించి ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు.

‘గిల్గిత్‌-బాల్టిస్థాన్‌తోపాటు జమ్మూ కశ్మీర్‌పై భారత్‌ ఇటీవల బాధ్యతారాహిత్య ప్రకటనలు చేయడాన్ని చూశాం. మా మాతృభూమిలో ప్రతి అంగుళాన్ని రక్షించుకోవడమే కాకుండా.. శత్రువులు తమపై దాడిచేస్తే తిప్పి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేస్తున్నా’ అని పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మునీర్‌ వ్యాఖ్యానించారు. నియంత్రణ రేఖలో పర్యటన సందర్భంగా అక్కడి సైనికులు, ఆఫీసర్లతో మాట్లాడిన ఆయన.. ఎల్‌ఓసీలో నెలకొన్న తాజా పరిస్థితులు, కార్యాచరణ సంసిద్ధత, భారత్‌ ప్రకటనలపై సైనికాధికారులతో చర్చించారు. జనరల్‌ కమర్‌ జవేద్‌ బజ్వా పదవీ విరమణ అనంతరం నవంబర్‌ 24న పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌గా నియమితులైన  అసీమ్‌ మునీర్‌.. భారత్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదిలాఉంటే, కశ్మీర్‌ సమస్యతోపాటు పాకిస్థాన్‌ సీమాంతర ఉగ్రవాదం నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు గతకొన్నేళ్లుగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూ, కశ్మీర్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించిన అనంతరం (ఆగస్టు 2019 నుంచి) ఇవి మరింత క్షీణించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని