Masoud Pezeshkian: సంస్కరణవాదికే పట్టం.. ఇరాన్‌ కొత్త అధ్యక్షుడిగా మసౌద్‌ పెజెష్కియాన్‌..!

ఇరాన్‌కు మసౌద్‌ పెజెష్కియాన్‌ కొత్త అధ్యక్షుడిగా రాబోతున్నారు. ఆయనకు సంస్కరణవాదిగా పేరుంది. 

Published : 06 Jul 2024 11:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇబ్రహీం రైసీ (63) హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందడంతో ఇరాన్‌లో కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు ఎన్నికలు నిర్వహించారు. వాటిలో మసౌద్‌ పెజెష్కియాన్‌ (Masoud Pezeshkian) విజయం సాధించారు. పిడివాదిగా పేరుపొందిన సయీద్‌ జలిలితో పోటీపడి గెలుపొందారని ఆ దేశ హోం మంత్రిత్వశాఖ వెల్లడించింది.

ఈ ఎన్నికలో 30 మిలియన్ల మంది ఓటువేయగా పెజెష్కియాన్‌కు 16 మిలియన్లు.. జలిలికి 13 మిలియన్ల ఓట్లు వచ్చాయని ఎన్నికల సంఘం వెల్లడించింది. సంస్కరణవాదిగా పేరున్న మసౌద్‌.. హృద్రోగ నిపుణుడు. ఇరాన్‌ను ఆంక్షల చట్రం నుంచి బయటకు తీసుకురావడానికి పాశ్చాత్య దేశాలతో సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తానని తన ప్రచారంలో పేర్కొన్నారు. ఆయన అభ్యర్థిత్వానికి మాజీ అధ్యక్షులు హసన్ రౌహానీ, మహమ్మద్ ఖాటామి మద్దతు ఉంది. ఇదిలా ఉంటే.. జూన్‌ చివర్లో అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరిగింది. అయితే నాటి పోలింగులో దాదాపు 60% మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోకపోవడంతో జులై 5న రెండో బ్యాలెట్‌ (రన్‌ఆఫ్‌ పోలింగ్‌)ను నిర్వహించారు.  

గత కొన్నేళ్లుగా ఇరాన్‌ ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాల నేపథ్యంలో ఆగ్రహంతో ఉన్న ప్రజలు ఈ ఓటింగ్ పట్ల ఆసక్తి చూపలేదు. ఇద్దరు అభ్యర్థులను, వ్యవస్థను తిరస్కరించడానికే వారు ఇలా చేశారని మునుపటి ఓటింగ్ గురించి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. పోలైన ఓట్లలో 50% పైగా వచ్చినవారే విజేత అవుతారని ఇరాన్‌ చట్టాలు చెబుతున్నాయి. అలా రానప్పుడు.. అగ్రస్థానంలో ఉన్న ఇద్దరు అభ్యర్థుల మధ్య వారం రోజుల తర్వాత రన్‌ఆఫ్‌ పోలింగ్‌ నిర్వహించాలి. ఇలా 2005లో ఒకేఒక్కసారి జరిగింది. ఇప్పుడు జరిగింది కూడా రన్‌ఆఫ్‌ పోలింగే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని