
ఆ రెండు ద్వీపాలనూ వదలని మహమ్మారి.. తొలిసారి లాక్‌డౌన్!
ఇంటర్నెట్ డెస్క్: కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా కొమ్ములు విదిలిస్తోంది. ఈ మహమ్మారితో అమెరికా, బ్రిటన్, భారత్ తదితర దేశాలు తీవ్ర పరిణామాలూ ఎదుర్కొన్నాయి. అయితే, రెండేళ్లుగా ఇటువంటి పరిస్థితులకు దూరంగా ఉన్న పసిఫిక్ మహాసముద్రంలోని రెండు ద్వీప దేశాలు.. కిరిబాటి, సమోమాల్లో తాజాగా తొలిసారి లాక్‌డౌన్ విధించడం గమనార్హం. విదేశాల నుంచి ఇక్కడికి వచ్చినవారిలో పెద్దఎత్తున కరోనా కేసులు వెలుగుచూడటమే ఇందుకు కారణం. దీంతో అప్రమత్తమైన అధికారులు.. ప్రజలను ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశించారు.
డబ్ల్యూహెచ్‌వో వివరాల ప్రకారం.. దాదాపు 1.20 లక్షల జనాభా ఉన్న కిరిబాటీలో మహమ్మారి ప్రారంభం నుంచి ఈ నెల వరకు ఒక్క కేసూ నమోదు కాలేదు. కానీ, ఇటీవల అంతర్జాతీయ సరిహద్దులు తెరిచాక.. ఫిజీ నుంచి వచ్చిన ఓ విమానంలో ఏకంగా 36 మందికి పాజిటివ్‌గా తేలింది. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌తో నలుగురికి వైరస్ సోకింది. దీంతో అధికారులు.. శనివారం నుంచి స్థానికంగా లాక్‌డౌన్ విధించారు. మరోవైపు దేశ జనాభాలో ఇప్పటివరకు కేవలం 34 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది.
సమోవాలోనూ ఇదివరకు కేవలం రెండు కేసులు మాత్రమే బయటపడ్డాయి. తాజాగా ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో 15 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో స్థానికంగా శనివారం సాయంత్రం నుంచి 48 గంటల పాటు లాక్‌డౌన్ విధించినట్లు ప్రధాన మంత్రి ఫియామ్ నవోమి మాతాఫా చెప్పారు. వారికి ఒమిక్రాన్ సోకినట్లు భావిస్తున్నామన్నారు. కరోనా సోకినవారితో సన్నిహితంగా ఉన్న మరో తొమ్మిది మందిని ఐసొలేషన్‌లో ఉంచినట్లు వెల్లడించారు. సమోవా జనాభా 1.98 లక్షలు కాగా, 62 శాతం మంది టీకాలు వేయించుకున్నారు.