Rent a girl friend: అద్దెకు గర్ల్‌ఫ్రెండ్‌.. ఆ దేశంలో ఇదో కొత్త ట్రెండ్‌...

చైనాలో యువకులు వివాహం చేసుకోవడం ఆలస్యమవుతోంది. దీంతో వారి తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలని తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. ప్రత్యామ్నాయంగా యువకులు అద్దెలు చెల్లించి యువతులను తీసుకెళ్లి తమ గర్ల్‌ఫ్రెండ్స్‌గా పరిచేయం చేస్తున్నారు.

Published : 22 Mar 2023 18:29 IST

బీజింగ్‌ : గర్ల్‌ఫ్రెండ్‌ లేదని అనేకమంది యువకులు వాపోతుంటారు.  వీరి కోసమే తాజాగా కొన్ని ఏజెన్సీలు అద్దె చెల్లిస్తే చాలు గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. అయితే, ఈ సౌకర్యం చైనాలో మాత్రమే లభ్యం కావడం గమనార్హం. చైనాలో వివాహాలు ఆలస్యంగా చేసుకుంటున్నారు. ప్రత్యేకించి యువకులు తాము స్థిరపడిన అనంతరమే  వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడంతో వారి తల్లిదండ్రులు వివాహ సంబంధాలపై తీవ్రంగా ఒత్తిడి తీసుకువస్తున్నారు. దీంతో యువకులు ఇలా అద్దెకు గర్ల్‌ఫ్రెండ్స్‌ను తీసుకువచ్చి తమ తల్లిదండ్రులకు చూపిస్తున్నట్టు తెలుస్తోంది.

ఎలా బయటకు వచ్చింది...

అద్దెకు గర్ల్‌ఫ్రెండ్‌ వ్యవహారం చాలాకాలంగా ఉన్నప్పటికీ ఒక వార్తా సంస్థ విలేకరి స్టింగ్‌ ఆపరేషన్‌తో ఈ ఉదంతం బయటకు వచ్చింది. యువతుల కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్లు ఉన్నట్టు తెలియడంతో అందులో  ఒక వెబ్‌సైట్‌లో తనకొక గర్ల్‌ఫ్రెండ్‌ కావాలని ప్రకటన ఇచ్చాడు.  అనంతరం కొద్ది రోజులకు అతనికి ఒక మహిళ దగ్గర నుంచి కాల్‌ వచ్చింది.  తాను డిగ్రీ చదువుతున్నట్టు గర్ల్‌ఫ్రెండ్‌గా ఉండేందుకు రోజుకు 1000 యువాన్లు ( 145 డాలర్లు) ఇవ్వాలని కోరింది. దీనికి విలేకరి అంగీకరించడంతో యువతి అతను ఉంటున్న నాంజింగ్‌కు వచ్చి అతనితో సమావేశమైంది.

వైట్‌ కాలర్‌ జాబ్‌ ఉన్నా...

ఆ యువతి తనకు వైట్‌ కాలర్‌  ఉద్యోగం ఉన్నట్టు  నెలకు  5000 యువాన్లు జీతంగా పొందుతున్నట్టు వెల్లడించింది. తనకు ఖాళీగా ఉన్న సమయాల్లో గర్ల్‌ఫ్రెండ్‌ ఉద్యోగం చేస్తున్నట్టు పేర్కొంది. అయితే సెలవు సమయాల్లో గర్ల్‌ఫ్రెండ్‌గా ఉండేందుకు ఎక్కువ వసూలు చేస్తానని తెలపడం గమనార్హం. చైనా నూతన ఏడాది, మే డే, డ్రాగన్‌ బోట్‌ పండగ సందర్భంగా ఇప్పటికే తాను పలువురు క్లయింట్లతో అగ్రిమెంటు కుదుర్చుకున్నట్టు చెప్పింది. అనేకమంది యువకులు తమ తల్లిదండ్రుల ఒత్తిడి భరించలేక తనకు రుసుము చెల్లించి తనను వారి ఇంటికి తీసుకెళ్లి కాబోయే భార్యగా పరిచయం చేసిన విషయాన్ని ఆమె ప్రస్తావించడం గమనార్హం.  చైనాలో ఈ తరహా పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలను వేలాదిమంది యువతులు చేస్తున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంపై సీనియర్ సిటిజన్లు మండిపడుతున్నారు. కుటుంబ విలువలు, వివాహ వ్యవస్థ పతనమవుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని