Reusable bottles: టాయిలెట్‌ సీట్‌ మీద కంటే.. బాటిల్‌పైనే బ్యాక్టీరియా అధికమట..!

మనం నిత్యం వాడే వాటర్ బాటిళ్ల(Reusable bottles)పై భారీస్థాయిలో సూక్ష్మ క్రీములు ఉంటాయట. తాజా అధ్యయనంలో పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. 

Updated : 14 Mar 2023 14:45 IST

వాషింగ్టన్‌: మనం వెళ్లిన ప్రతిచోటా నీటిని కొనుక్కోలేక.. వెంట తాగునీటి బాటిళ్లను తీసుకెళ్తుంటాం. అలాగే పరిశుభ్రమైన నీటిని తాగే ఉద్దేశంతో పాఠశాలలు, కార్యాలయాలకు వాటిని మోసుకెళ్తుంటాం. కానీ పునర్వినియోగ బాటిళ్ల(Reusable bottles)పై మిలియన్ల కొద్దీ బ్యాక్టీరియా( Bacteria) ఉంటుందట. టాయిలెట్ సీటుపై కంటే కూడా 40వేల రెట్లు అదనంగా బ్యాక్టీరియా వీటి మీద ఉంటుందట. రకరకాల బాటిల్ మూతల నుంచి అమెరికాకు చెందిన ‘వాటర్‌ఫిల్టర్‌గురు. కామ్‌’ నమూనాలను సేకరించి పరిశోధించింది. ఈ క్రమంలో వారు గ్రామ్-నెగెటివ్ రాడ్స్(gram-negative rods), బాసిల్లస్‌(bacillus) వంటి రెండు రకాల బ్యాక్టీరియాను గుర్తించారు. 

గ్రామ్‌ నెగెటివ్‌ బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్‌తో యాంటీ బయోటిక్స్ పనిచేయకపోవచ్చని, అలాగే బాసిల్లస్‌కు చెందిన  కొన్నిరకాల బ్యాక్టీరియా( Bacteria) జీర్ణాశయ సంబంధిత సమస్యలకు కారణం అవుతుందని పరిశోధకులు వెల్లడించారు. బాటిళ్ల శుభ్రతను వంటగది పాత్రలతో పోల్చగా వాటిపై  కిచెన్‌సింక్‌తో పోలిస్తే రెండు రెట్లు, కంప్యూటర్ మౌస్‌తో పోలిస్తే నాలుగు రెట్ల సూక్ష్మ క్రీములు ఉన్నాయట. పాత్రల్లో బ్యాక్టీరియా ఉండటం కొత్తేంకాదని ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ మాలిక్యులర్‌ బయాలజిస్టు వెల్లడించారు. బాటిళ్లపై అధిక సంఖ్యలో బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉన్నప్పటికీ.. అందులో అన్నీ ప్రమాదకర ఇన్ఫెక్షన్‌ కారకాలు కావని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ వైద్య నిపుణుడు వెల్లడించారు. ‘వాటర్‌ బాటిళ్ల కారణంగా అనారోగ్యానికి గురైన కేసు గురించి నేను వినలేదు. అలాగే ట్యాప్‌ వాటర్ విషయంలో కూడా. ఇప్పటికే ప్రజల నోటిలో ఉన్న బ్యాక్టీరియాతోనే బాటిళ్లు కలుషితమయ్యే అవకాశం ఉంది’ అని వెల్లడించారు. ఈ బాటిళ్లను రోజుకు కనీసం ఒక్కసారైనా సోపు కలిపిన వేడి నీటితో శుభ్రం చేయాలని పరిశోధకులు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని