Sleep loss: అధిక ఉష్ణోగ్రతలతో నిద్రపై ప్రతికూల ప్రభావం! తాజా అధ్యయనంలో వెల్లడి

వాతావరణ మార్పులు అనేక దుష్పరిణామాలకు దారి తీస్తోన్న విషయం తెలిసిందే. మన చుట్టూ ఉష్ణోగ్రతలూ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా మనుషుల నిద్రపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని...

Published : 24 May 2022 01:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాతావరణ మార్పులు అనేక దుష్పరిణామాలకు దారి తీస్తోన్న విషయం తెలిసిందే. మన చుట్టూ ఉష్ణోగ్రతలూ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా మనుషుల నిద్రపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. ‘వన్ ఎర్త్’ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం.. 2099 నాటికి ప్రతి వ్యక్తి ఏడాదికి 50 నుంచి 58 గంటల నిద్రను కోల్పోయే ప్రమాదం ఉంది. పేద దేశాల ప్రజలతోపాటు వృద్ధులు, మహిళల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. దీంతో అనేక శారీరక, మానసిక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

ఈ అధ్యయనం కోసం.. 68 దేశాల్లో 47 వేలకుపైగా ప్రజలకు యాక్సిలరోమీటర్ ఆధారిత స్లీప్-ట్రాకింగ్ రిస్ట్‌బ్యాండ్‌లు అందజేసి పరీక్షించారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా భవిష్యత్తులో మరణాలతోపాటు ఆసుత్రుల్లో చేరికలు పెరుగుతాయని, మనుషుల పనితీరుపై ప్రభావం పడుతుందని ఆయా అధ్యయనాల్లో వెల్లడైంది. కానీ.. మానవ జీవ, ప్రవర్తనా విధానాలపై వాటి ప్రభావం విషయంలో పూర్తి స్థాయిలో అధ్యయనం జరగలేదు. ‘వేడి వాతావరణం కారణంగా.. పెద్దలు ఆలస్యంగా నిద్రపోతారు. ముందుగానే మేల్కొంటారు. సగటు కంటే అధిక ఉష్ణోగ్రతలు నిద్రను తగ్గిస్తాయని మా అధ్యయనం మొదటిసారి తగు సాక్ష్యాలు అందిస్తోంది’ అని కోపెన్‌హెగెన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యయనకర్త కెల్టన్ మైనర్ చెప్పారు.

‘సాధారణంగా మన శరీరాలు స్థిరమైన ఉష్ణోగ్రతను నిర్వహిస్తుంటాయి. అయితే, రాత్రి వేళల్లో మనకు తెలియకుండానే కొంత వేడిని వాతావరణంలోకి విడుదల చేస్తాయి. దీంతో శరీరం కాస్త చల్లబడి, నిద్రపడుతుంది. అయితే, ఇందుకోసం.. చుట్టూ వాతావరణం మన శరీర ఉష్ణోగ్రత కంటే చల్లగా ఉండాలి. కానీ, అధిక వేడి కారణంగా ఇది కష్టమవుతోంది. 30 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతల రాత్రుల్లో నిద్ర సమయం సగటున 14 నిమిషాలు తగ్గుతుంది. వేడి పెరిగే కొద్దీ నిద్ర సమయం కూడా ఏడు గంటల కంటే తక్కువకు పడిపోయే అవకాశాలు అధికం. భిన్న కాలాలు, ప్రదేశాలు, వాతావరణ పరిస్థితుల్లోనూ.. అధిక ఉష్ణోగ్రతలు నిద్రను దెబ్బతీస్తాయి. టెంపరేచర్‌ ఎక్కువైనకొద్ది నిద్ర నష్టం కూడా పెరుగుతుంది’ అని మైనర్ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని