Rishi Sunak: స్పీడ్‌ డ్రైవింగ్‌ అభియోగాలు.. బ్రేవర్‌మన్‌పై దర్యాప్తు చేయలేం: రిషి సునాక్‌

బ్రిటన్‌ హోంమంత్రి సువెల్లా బ్రేవర్‌మన్‌ (Suella Braverman) వివాదంలో చిక్కుకున్నారు. గత ఏడాది అటార్నీ జనరల్‌గా ఉన్నప్పుడు లండన్‌ వెలుపల అతి వేగంగా కారును నడిపినందుకు వేసిన ఫైన్‌, పాయింట్లను దాచిపెట్టేందుకు ప్రయత్నించారని ఆమెపై విమర్శలొచ్చాయి.

Published : 24 May 2023 17:26 IST

లండన్‌: భారత సంతతికి చెందిన బ్రిటన్‌ హోంమంత్రి సువెల్లా బ్రేవర్‌మన్‌ (Suella Braverman) స్పీడ్‌ డ్రైవింగ్‌ వివాదంపై ప్రధానమంత్రి రిషి సునాక్ (Rishi Sunak) స్పందించారు. ఈ ఘటనలో ఆమె ఎలాంటి మంత్రిత్వ నిబంధనలను ఉల్లంఘించలేదని తెలిపారు. అందువల్ల, ఆమెపై ఎలాంటి దర్యాప్తు చేపట్టబోమని స్పష్టం చేశారు.

స్పీడ్ డ్రైవింగ్‌ చేసినందుకు గానూ తనకు పడిన ఫైన్‌, పాయింట్లను దాచిపెట్టేందుకు సుయెల్లా (Suella Braverman) ప్రయత్నించారని ఆమెపై విమర్శలు వచ్చాయి. ఇందులో ఆమె పేరు బయటకు రాకుండా ఉండేలా.. ఆమె రాజకీయ సాయం కోరడం దుమారం రేపింది. దీంతో బ్రేవర్‌మన్‌ తీరుపై మండిపడ్డ విపక్షాలు.. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని డిమాండు చేశాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై రిషి సునాక్‌ (Rishi Sunak) బుధవారం స్పందించారు. ‘‘ఈ వ్యవహారం మినిస్టీరియల్‌ కోడ్‌ ఉల్లంఘన కిందకు రానందున.. దీనిపై దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని నిర్ణయించాం’’ అని బ్రిటన్‌ ప్రధాని వెల్లడించారు. అయితే, ఈ వ్యవహారంపై అవాస్తవాలు వ్యాప్తి కాకుండా తగిన విధంగా స్పందించాలని బ్రేవర్‌మన్‌ను ఆయన సూచించారు.

అసలేంటీ వివాదం..

గతేడాది అటార్నీ జనరల్‌గా ఉన్నప్పుడు లండన్‌ (London) వెలుపల అతి వేగంగా (Speed Driving) కారును నడిపినందుకు గానూ బ్రేవర్‌మన్‌కు ఫైన్‌, పాయింట్లు పడ్డాయి. బ్రిటన్‌లో అతి వేగంగా కారు నడిపితే ఫైన్‌ విధిస్తారు. దీంతోపాటు అవేర్‌నెస్‌ కార్యక్రమానికి బృందంతోగానీ, ఆన్‌లైన్‌లోగానీ హాజరు కావాల్సి ఉంటుంది. లేదంటే లైసెన్సులో పాయింట్లను నమోదు చేస్తారు. అవి ఎక్కువైతే లైసెన్సు రద్దవుతుంది. అయితే ఈ ఫైన్‌, పాయింట్లను దాచిపెట్టేందుకు బ్రేవర్‌మన్‌ ప్రయత్నించారని విమర్శలొచ్చాయి. ఈ విషయంలో సహాయం చేయాల్సిందిగా ఆమె అధికారులను కోరినట్లు బ్రిటన్‌ మీడియా కథనాలను ప్రచురించింది. అవేర్‌నెస్‌ కార్యక్రమానికి అందరితో కలిసి వెళ్తే విషయం బయటపడుతుందని, అందరూ తననే చూస్తారనే ఉద్దేశంతో తన ఒక్కరికే విడిగా ఏర్పాటు చేసేలా మేనేజ్‌ చేయాలని అధికారులను బ్రేవర్‌మన్‌ (Suella Braverman) కోరినట్లు అక్కడి మీడియా పేర్కొంది. అయితే, అందుకు అధికారులు తిరస్కరించడంతో ఓ రాజకీయ సహాయకుడి సాయంతో తనకు విడిగా అవేర్‌నెస్‌ కోర్సును ఏర్పాటు చేయాలని ఆన్‌లైన్‌ నిర్వాహకుడికి ఆమె విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది.

అయితే, ఈ ఆరోపణలను బ్రేవర్‌మన్‌ ఖండించారు. ‘‘ప్రొటోకాల్స్‌పై నాకు స్పష్టమైన అవగాహన లేదు. అందుకే, హోంమంత్రిగా ఉన్న నేను ఈ సమయంలో అవేర్‌నెస్‌ కోర్సుకు హాజరవ్వడం సరైందేనా అని అధికారులను అడిగాను. ఇది తగిన సమయం కాదని వారు సూచించడంతో ఈ చర్చలను ఆపేశాను. అతివేగంగా కారు నడిపినందుకు పెనాల్టీ కూడా కట్టాలని నిర్ణయించుకున్నా. అంతేగానీ, ఇందులో నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశం నాకు లేదు’’ అని ప్రధానికి రాసిన లేఖలో ఆమె వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని