Rishi Sunak: ఓడిన చోటే విజేతగా.. రిషి సునాక్‌ ప్రస్థానమిదీ..!

బ్రిటన్‌ నూతన ప్రధానిగా రిషి సునాక్ ఎన్నికయ్యారు. యూకే పగ్గాలు చేపడుతున్న తొలి భారత సంతతి వ్యక్తిగా అరుదైన ఘనత సాధించిన ఆయన గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం.

Published : 25 Oct 2022 02:57 IST

సరిగ్గా 48 రోజుల క్రితం

బ్రిటన్‌లో అధికార కన్జర్వేటివ్‌ పార్టీలో ప్రధాని అభ్యర్థి ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. లిజ్‌ ట్రస్‌, రిషి సునాక్‌ మధ్య హోరాహోరీ పోరులో చివరకు విజయం ట్రస్‌నే వరించింది. ప్రచారం సమయంలో సునాక్‌ మాటలు పట్టించుకోని టోరీ సభ్యులు ట్రస్‌ వైపే మొగ్గారు. అయితే ఆమె స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో ట్రస్‌కు 57శాతం ఓట్లు రాగా.. సునాక్‌కు 43శాతం ఓట్లు లభించాయి. 

కట్‌ చేస్తే.. సీన్‌ రివర్స్‌

అనూహ్యంగా ప్రధాని రేసులోకి వచ్చి పదవి చేపట్టిన ట్రస్‌ అనుకోని విధంగా పీఠం నుంచి దిగిపోవాల్సి వచ్చింది. దీంతో మళ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈ సారి రిషి సునాక్‌కు అవకాశం చేజారలేదు. తప్పు తెలుసుకున్న టోరీ ఇప్పుడు ఆయనకు పట్టం కట్టింది. నెలన్నర రోజుల క్రితం ఓటమిపాలైన అదే సునాక్‌.. నేడు బ్రిటన్‌ ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. బ్రిటన్‌ పాలనా పగ్గాలు అందుకున్న తొలి భారత సంతతి వ్యక్తిగా అరుదైన ఘనత సాధించారు. ఈ సందర్భంగా రిషి సునాక్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు..

భారత సంతతి కుటుంబంలో పుట్టి..

రిషి సునాక్‌ 1980 మే 12న ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌లో జన్మించారు. ఆయన పూర్వీకులు పంజాబ్‌కు చెందిన వారు. వారు తొలుత తూర్పు ఆఫ్రికాకు వలస వెళ్లి.. అక్కడి నుంచి పిల్లలతో సహా యూకేకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. సునాక్ తండ్రి యశ్‌వీర్‌ కెన్యాలో.. తల్లి ఉష టాంజానియాలో జన్మించారు. వీరి కుటుంబాలు బ్రిటన్‌కు వలసవెళ్లాక వివాహం చేసుకున్నారు. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీ నుంచి ఎంబీఏ చేసిన రిషి.. తొలుత కొన్ని సంస్థల్లో ఉద్యోగం చేశారు. కాలిఫోర్నియాలో చదువుతున్న రోజుల్లో ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతాతో పరిచయం ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు.

బోరిస్‌ అండతో మంత్రిగా..

చదువుకునే రోజుల్లోనే కన్జర్వేటివ్‌ పార్టీలో కొంతకాలం ఇంటర్న్‌షిప్‌ చేశారు. ఆ తర్వాత 2014లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2015లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రిచ్‌మాండ్‌ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మరోసారి రిషి విజయం సాధించారు. 2019లో జరిగిన కన్జర్వేటివ్‌ పార్టీ నాయకత్వ ఎన్నికల్లో రిషి.. బోరిస్‌కు మద్దతిచ్చారు. దీంతో బోరిస్‌ ప్రధానిగా ఎన్నికైన తర్వాత రిషికి ఆర్థిక శాఖలో చీఫ్‌ సెక్రటరీగా కీలక బాధ్యతలు అప్పగించారు. బోరిస్‌ జాన్సన్‌కు అత్యంత నమ్మకస్తుడిగా సునాక్‌కు పేరుంది. తన వ్యక్తిత్వం, దూకుడు శైలితో ‘రైజింగ్‌ స్టార్‌’ మినిస్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. సునాక్ పనితీరుకు మెచ్చి 2020 ఫిబ్రవరిలో ఛాన్సలర్‌గా పదోన్నతి కల్పించారు. కేబినెట్‌లో పూర్తి స్థాయి ఆర్థిక మంత్రిగా చేరింది అప్పుడే. అదే ఏడాది మార్చిలో సునాక్‌ పార్లమెంట్‌లో తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. హిందువైన సునాక్‌.. పార్లమెంట్‌లో ఎంపీగా భగవద్గీతపై ప్రమాణం చేశారు.

కరోనా సమయంలో పాపులారిటీ..

కరోనా సంక్షోభ సమయంలో ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచేలా బిలియన్‌ పౌండ్ల విలువ చేసే అత్యవసర పథకాలను సునాక్‌ ప్రకటించారు. వ్యాపారులు, ఉద్యోగుల కోసం కూడా అనేక ఆకర్షణీయ పథకాలు, ఉద్దీపనలు తీసుకొచ్చారు. దీంతో పాటు పార్లమెంటులో ఆయన పనితీరు, పాలసీల రూపకల్పనతో బ్రిటన్‌ ప్రజల్లో మంచి ఆదరణ పొందారు. అప్పట్లో ఆయన ఫొటోలు సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. దీంతో బోరిస్‌ జాన్సన్‌ పదవి నుంచి దిగిపోయిన తర్వాత తదుపరి ప్రధాని ఎవరన్న చర్చ రాగానే రిషి పేరు విపరీతంగా వినిపించింది. అందుకు అనుగుణంగానే ఇటీవల జరిగిన ఎన్నికల్లో లిజ్‌ ట్రస్‌కు గట్టిపోటీనిచ్చారు.

సతీమణి పన్ను వివాదం..

ఆ మధ్య రిషి సతీమణి అక్షతా మూర్తిపై వచ్చిన పన్ను ఎగవేత ఆరోపణలు సునాక్‌ను ఇబ్బందుల్లోకి నెట్టాయి. అక్షత బ్రిటన్‌లో ‘నాన్‌-డొమిసైల్‌’ హోదాలో నివసిస్తున్నారు. ఆమెకు ఇప్పటికీ భారత పౌరసత్వమే ఉంది. వేరే దేశంలో స్థిర నివాసం ఉన్న వారికి బ్రిటన్‌లో ‘నాన్‌-డొమిసైల్‌’ పన్ను హోదా ఇస్తారు. ఇది పొందిన వారు విదేశాల్లో తాము ఆర్జించే ఆదాయానికి బ్రిటన్‌లో పన్ను కట్టక్కర్లేదు. ఈ హోదాను అడ్డుపెట్టుకొని అక్షత.. పన్ను ఎగవేస్తున్నారనేది ప్రతిపక్షాల ఆరోపణ. అయితే తాము చట్టప్రకారం బ్రిటన్‌లో చేస్తున్న వ్యాపారాలకు పన్ను చెల్లిస్తున్నానని అక్షతా మూర్తి ప్రతినిధి అప్పట్లో తెలిపారు. ఇది కాస్తా తీవ్ర దుమారం రేపడంతో అక్షతా మూర్తి స్పందించారు. ‘నాన్‌-డొమిసైల్‌’ పన్ను హోదా చట్టబద్ధమేనని తెలిపారు. అయినప్పటికీ.. విదేశాల్లో పొందిన ఆర్జనపై పన్ను నుంచి మినహాయింపునిస్తున్న ఈ నిబంధనల నుంచి ఇక ఏమాత్రం ప్రయోజనం పొందబోనని స్పష్టం చేశారు. తన భర్త పదవికి ఇబ్బందిగా మారకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

సునాక్‌ చెప్పినట్లే జరిగింది..

బోరిస్‌ రాజీనామా తర్వాత జరిగిన ఎన్నికల్లో లిజ్‌ ట్రస్, రిషి సునాక్‌ మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోన్న బ్రిటన్‌లో పన్ను కోతలే ప్రధాన అంశంగా వీరిద్దరి మధ్యా ప్రచారం సాగింది. సంపన్న వర్గాలకు పన్ను తగ్గిస్తామని ట్రస్‌ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. అయితే దీన్ని సునాక్‌ తప్పుబట్టారు. పన్ను కోతలతో ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని అప్పుడే హెచ్చరించారు. అప్పుడు సునాక్‌ మాటలను అర్థం చేసుకోని టోరీ సభ్యులు ట్రస్‌ను గెలిపించారు. ప్రధాని పదవి చేపట్టిన తర్వాత.. ట్రస్‌ మినీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి.. అందులో సంపన్నులకు ఆదాయపు పన్నులో 45శాతం మేర కోత విధిస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయంతో బ్రిటన్‌ మార్కెట్లు కుదేలయ్యాయి. డాలర్‌తో పోలిస్తే బ్రిటన్‌ పౌండ్‌ విలువ భారీగా పతనమైంది. అదే సమయంలో సామాన్య ప్రజలతో సమానంగా ధనిక వర్గాలకూ ఇంధన రాయితీ ఇవ్వడం పెను దుమారం రేపింది. ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడటంతో సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలోనే దిద్దుబాటు చర్యలకు దిగిన ట్రస్‌.. తన నిర్ణయాలపై యూటర్న్‌ తీసుకున్నారు. ఆర్థిక మంత్రిపై వేటు వేశారు. ఆ తర్వాత కూడా పరిస్థితులు తనకు అనుకూలంగా మారలేదు. దీంతో తప్పులను అంగీకరించిన ట్రస్‌.. పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఎన్నికలు అనివార్యం కాగా.. ఈ సారి సునాక్‌ ఘన విజయం సాధించారు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్న సామెతను నిజం చేస్తూ ఓడిన చోటే విజేతగా నిలిచారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని