Published : 10 Apr 2022 01:35 IST

Rishi Sunak: బ్రిటన్‌ ప్రధాని రేసులో వెనకబడ్డ రిషి సునక్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్రిటన్‌లో అక్కడి ఆర్థిక మంత్రి రిషి సునక్‌ పేరు ఇప్పుడు పతాక శీర్షికల్లో నిలుస్తోంది. భారత మూలాలున్న ఈ వ్యక్తి కొన్ని వారాల క్రితం ప్రధానమంత్రి రేసులో ముందున్నట్లు అక్కడి సర్వేలు చెప్పాయి. కానీ, ఇప్పుడు ఆ ప్రతిష్ఠ మసకబారినట్లు ఆన్‌లైన్‌ పోల్స్‌ చెబుతున్నాయి. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి.

ఉద్దీపనల ఉపసంహరణ..

కరోనా సంక్షోభం తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సునక్‌ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు వావాదాస్పదంగా మారాయి. కరోనా విజృంభణ సమయంలో ప్రజలు, ఉద్యోగులకు అండగా ఉండేందుకు అనేక పథకాలను ప్రకటించిన ఆయన.. తర్వాత ఖజానాపై భారం పడకుండా కొన్ని వర్గాలపై పన్నులు పెంచారు. దీనికి ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. దీంతో నిత్యావసర వస్తువులు పెరిగి పోయాయి. ఓవైపు పన్నుల పెంపు.. మరోవైపు ధరల పెరుగుదల ప్రజల్లో అసహనానికి కారణమైంది. దీనతంటికీ రిషి సునక్‌ నిర్ణయాలే కారణమని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి.

సతీమణి పన్ను వివాదం..

ఇటీవల ఆయన సతీమణి అక్షతా మూర్తిపై వస్తున్న పన్ను ఎగవేత ఆరోపణలూ సునక్‌ను ఇబ్బందుల్లోకి నెట్టాయి. అక్షత బ్రిటన్‌లో ‘నాన్‌-డొమిసైల్‌’ హోదాలో నివసిస్తున్నారు. ఆమెకు ఇప్పటికీ భారత పౌరసత్వమే ఉంది. వేరే దేశంలో స్థిర నివాసం ఉన్న వారికి బ్రిటన్‌లో ‘నాన్‌-డొమిసైల్‌’ పన్ను హోదా ఇస్తారు. ఇది పొందిన వారు విదేశాల్లో తాము ఆర్జించే ఆదాయానికి బ్రిటన్‌లో పన్ను కట్టక్కర్లేదు. ఈ హోదాను అడ్డుపెట్టుకొని అక్షత.. పన్ను ఎగవేస్తున్నారనేది ప్రతిపక్షాల ఆరోపణ. అయితే తాను చట్టప్రకారం బ్రిటన్‌లో చేస్తున్న వ్యాపారాలకు పన్ను చెల్లిస్తున్నానని అక్షతా మూర్తి ప్రతినిధి తెలిపారు. సునక్‌ సన్నిహితులు మాత్రం ఇవి రాజకీయ ప్రేరిత ఆరోపణలు అంటున్నారు. భవిష్యత్తులో సునక్‌ బ్రిటన్‌ ప్రధాని కావచ్చొన్న అంచనాల నేపథ్యంలోనే రాజకీయంగా ఆయన ఎదుగుదలను అడ్డుకొనే కుట్రలో భాగమే ఈ విమర్శలని వారు చెబుతున్నారు.

పాండమిక్‌తో పాపులారిటీ..

కరోనా సంక్షోభ సమయంలో ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచేలా బిలియన్ల పౌండ్లు విలువ చేసే అత్యవసర పథకాలను సునక్‌ ప్రకటించారు. దీంతో పాటు పార్లమెంటులో ఆయన పనితీరు, పాలసీల రూపకల్పనతో బ్రిటన్‌ ప్రజల్లో మంచి ఆదరణ పొందారు. అదే సమయంలో ప్రధాని బోరిస్‌ జాన్సన్‌పై వచ్చిన విమర్శలూ సునక్‌ ప్రతిష్ఠ పెరగడానికి ఉపయోగపడ్డాయి. కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న సమయంలో బోరిస్‌ తన సహచరులతో కలిసి నిబంధనలకు విరుద్ధంగా విందులో మునిగి తేలారన్న విమర్శలు బ్రిటన్‌ రాజకీయాలను కుదిపేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఒకవేళ పదవి నుంచి బోరిస్‌ దిగిపోవాల్సి వస్తే.. తదుపరి పీఎం ఎవరనే దానిపై విస్తృతంగా చర్చ జరిగింది. దీంతో రిషి సునకే అందుకు తగిన వ్యక్తి అని ఆన్‌లైన్‌ సర్వేలు అప్పట్లో కోడై కూసాయి. దీనిపై బెట్టింగులు కూడా జోరుగా సాగాయి. 

కానీ, తర్వాత రోజుల్లో బోరిస్‌ క్షమాపణలు చెప్పడం, ఉద్దీపనలను సునక్‌ ఉపసంహరించుకోవడం చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌-రష్యా ఉద్రిక్తతలు వచ్చి పడ్డాయి. దీంతో రిషి ప్రతిష్ఠ సైతం క్రమంగా మసకబారుతూ వచ్చింది. తాజా పన్ను వివాదం దాన్ని మరింత దిగజార్చింది. ఓ ప్రముఖ ఆన్‌లైన్‌ సర్వే ప్రకారం.. నెల క్రితం 34 శాతం మంది ఆయన్ని ప్రధానిగా చూడాలనుకుంటున్నామని తెలిపారు. ఇప్పుడు అలాంటి వారి సంఖ్య 12 శాతానికి పడిపోవడం గమనార్హం. 

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని