Rishi Sunak: ప్రపంచ దేశాలను ఏలుతున్న భారత సంతతి బిడ్డలు వీరే..!

రిషి సునాక్‌(Rishi sunak)  ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో భారత్‌ మూలాలున్న వ్యక్తులు అధికారం చేపట్టే ఆరో దేశంగా బ్రిటన్‌ నిలిచింది. ఇప్పటికే ఆరు దేశాల్లో అధ్యక్ష/ ప్రధాని/ ఉపాధ్యక్ష బాధ్యతల్లో భారత సంతతి వ్యక్తులు కొనసాగుతున్నారు.

Updated : 25 Oct 2022 19:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్రిటన్‌ రాజకీయాల్లో భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌(Rishi sunak) చరిత్ర సృష్టించారు. లిజ్‌ ట్రస్‌(Liz truss) రాజీనామాతో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో టోరీ సభ్యులు సోమవారం ఆయన్ను కన్జర్వేటివ్‌ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకోగా.. ఈరోజు ఆయన బ్రిటన్‌ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తాజా పరిణామంతో భారత మూలాలున్న వ్యక్తులు అధికారం చేపట్టిన ఆరో దేశంగా బ్రిటన్‌ నిలిచింది. ఇప్పటికే ఆరు దేశాల్లో అధ్యక్ష, ప్రధాని, ఉపాధ్యక్ష బాధ్యతల్లో భారత సంతతి వ్యక్తులు కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఏయే దేశాల్లో భారత మూలాలున్న వ్యక్తులు కీలక పదవులు చేపట్టారో ఓసారి పరిశీలిస్తే.. 

  • రిషి సునాక్‌- బ్రిటన్‌ నూతన ప్రధాని: భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ బ్రిటన్‌ నూతన ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌ నగరంలో జన్మించిన రిషి పూర్వీకుల మూలాలు భారత్‌లోని పంజాబ్‌లో ఉన్నాయి. వారు టాంజానియా, కెన్యా నుంచి బ్రిటన్‌కు వలస వెళ్లారు. బోరిస్‌ జాన్సన్‌ హయాంలో బ్రిటన్‌ ఆర్థికమంత్రిగా పనిచేసి మంచి గుర్తింపు పొందిన రిషి సునాక్‌.. తాజాగా ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 
  • ఆంటోనియా కోస్టా - పోర్చుగల్‌ ప్రధానమంత్రి: గోవా మూలాలున్న ఆంటోనియో కోస్టా పోర్చుగల్‌ ప్రధానిగా కొనసాగుతున్నారు. ఆంటోనియో కోస్టా తండ్రి ఆర్నాల్డో డా కోస్టా.. గోవాకు చెందినవారు.
  • మహమ్మద్‌ ఇర్ఫాన్‌ అలీ - గయానా అధ్యక్షుడు: ఇండో-గయానా ముస్లిం కుటుంబంలో జన్మించిన మహమ్మద్‌ ఇర్ఫాన్‌ అలీ.. 2020లో గయానా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
  • ప్రవింద్‌ జుగ్నాథ్‌ - మారిషస్‌ ప్రధానమంత్రి : మారిషస్‌ ప్రధానిగా 2017లో బాధ్యతలు చేపట్టిన ప్రవింద్‌ జుగ్నాథ్‌ భారత మూలాలున్న హిందూ కుటుంబానికి చెందిన వ్యక్తి.
  • పృథ్వీరాజ్‌సింగ్‌ రూపున్‌ - మారిషస్‌ అధ్యక్షుడు: మారిషస్‌ అధ్యక్షుడు పృథ్వీరాజ్‌సింగ్‌ రూపున్‌ కుటుంబం కూడా భారత ఆర్యసమాజ్‌ హిందూ కుటుంబానికి చెందినదే. పలుమార్లు పార్లమెంట్‌ సభ్యుడిగా ఎన్నికైన ఆయన.. 2019లో మారిషస్‌ అధ్యక్షుడు అయ్యారు. 
  • చంద్రికా ప్రసాద్‌ సంతోఖి (చాన్ సంతోఖి), సురినామ్‌ అధ్యక్షుడు: దక్షిణ అమెరికాలోని సురినామ్‌ దేశాధ్యక్షుడిగా చంద్రికా ప్రసాద్‌ సంతోఖి కొనసాగుతున్నారు. 1959లో జన్మించిన ఆయన కుటుంబం కూడా భారత మూలాలున్నదే.
  • కమలా హ్యారిస్‌ - అమెరికా ఉపాధ్యక్షురాలు: భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ అమెరికా ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆమె పూర్వీకులు తమిళనాడులోని తిరువారూర్‌ జిల్లా తులసేంద్రిపురానికి చెందినవారు. కమలా హ్యారిస్‌ తల్లి శ్యామలా గోపాలన్‌ తమిళనాడుకు చెందిన వారు.

ఇలా భారత మూలాలున్న వ్యక్తులు విదేశీ గడ్డపై రాజకీయాల్లో కీలక పదవులు చేపడుతూ తమ సత్తా చాటుతున్నారు. కేవలం ఈ ఆరు దేశాలే కాకుండా ట్రినిడాడ్‌&టొబాగో, పోర్చుగల్‌, మలేసియా, ఫిజీ, ఐర్లాండ్‌ వంటి దేశాల్లో భారత సంతతి వ్యక్తులు కీలక పదవుల్లో కొనసాగుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని