Ukraine Crisis: ఉక్రెయిన్‌లో నెత్తుటి నదులు పారుతున్నాయి: పోప్‌ ఫ్రాన్సిస్‌ ఆవేదన

ఉక్రెయిన్‌లో రష్యా దాడులను క్రైస్తవ మత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌ తీవ్రంగా ఖండించారు. ఇది మిలిటరీ ఆపరేషన్‌ కాదని.. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తోందని మండిపడ్డారు......

Published : 07 Mar 2022 01:13 IST

వాటికన్‌ సిటీ: ఉక్రెయిన్‌లో రష్యా దాడులను క్రైస్తవ మత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌ తీవ్రంగా ఖండించారు. ఇది మిలిటరీ ఆపరేషన్‌ కాదని.. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తోందని మండిపడ్డారు. ఆ దేశంలో నెత్తుటి నదులు పారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఉక్రెయిన్‌లో నెత్తురు, కన్నీటి నదులు పారుతున్నాయి. ఇది కేవలం సైనిక చర్య కాదు. మరణం, విధ్వంసం, దుఃఖాన్ని నాటుతోన్న యుద్ధం’ అని పోప్‌ ఫ్రాన్సిస్‌ విచారం ప్రకటించారు. వాటికన్‌ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో ఆయన ఆదివారం ప్రసంగించారు.

ప్రస్తుత సంక్షోభ సమయంలో శరణార్థుల కోసం మానవతా కారిడార్‌లను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఉక్రెయిన్‌ నుంచి పారిపోయిన వచ్చిన శరణార్థులు పోలండ్‌లోని చర్చిల్లో ఆశ్రయం పొందుతున్న వేళ ప్రస్తుత పరిస్థితులపై పోప్‌ ఆవేదన చెందారు. అధ్యక్షుడు వ్యాదిమిర్‌ పుతిన్‌ ఈ యుద్ధాన్ని ఆపివేసేలా ప్రభావతం చేయాలని రష్యన్‌ ఆర్థడాక్స్‌ చర్చిని కోరారు.

ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు కొనసాగుతున్నాయి. బాంబులు, రాకెట్లతో ప్రధాన నగరాల్లోకి భవనాలపై విరుచుకుపడుతోంది. అయితే ఉక్రెయిన్‌లోని జనావాస ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకుని రష్యా బలగాలు దాడులు చేస్తున్నాయని బ్రిటిష్ మిలిటరీ ఇంటెలిజెన్స్ విభాగం ఆదివారం ఆరోపించింది. ఖార్కివ్‌, చెర్నిహివ్‌, మరియుపోల్‌ నగరాల్లోకి జనావాసాలపైనే దాడులకు పాల్పడినట్లు పేర్కొంది. ఉక్రెయిన్‌ను తక్కువ అంచనా వేసిందని, ఆ దేశం దీటుగా స్పందిస్తుండటంతో.. రష్యా సైన్యం వేగంగా ముందుకు వెళ్లలేకపోతోందని ఇంటెలిజెన్స్ విభాగం చెప్పుకొచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని