Afghan: అఫ్గాన్‌పై పాక్‌ రాకెట్‌ దాడి.. ఐదుగురు చిన్నారులు సహా మహిళ మృతి

అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్‌ రాకెట్‌ దాడులు చేపట్టింది. సరిహద్దు ప్రాంతమైన తూర్పు అఫ్గాన్‌  ప్రావిన్స్‌పై పాక్‌ సైనిక దళాలు జరిపిన రాకెట్‌ దాడుల్లో ఆరుగురు మృతిచెందినట్లు.......

Published : 17 Apr 2022 02:14 IST

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్‌ రాకెట్‌ దాడులు చేపట్టింది. సరిహద్దు ప్రాంతమైన తూర్పు అఫ్గాన్‌  ప్రావిన్స్‌పై పాక్‌ సైనిక దళాలు జరిపిన రాకెట్‌ దాడుల్లో ఆరుగురు మృతిచెందినట్లు అఫ్గాన్‌కు చెందిన ఓ అధికారి వెల్లడించారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు, ఓ మహిళ ఉన్నట్లు పేర్కొన్నారు. ‘కునార్‌లోని షెల్టాన్‌ జిల్లాలో పాకిస్థాన్‌ ప్రయోగించిన రాకెట్‌ దాడుల్లో ఐదుగురు చిన్నారులు సహా ఓ మహిళ మృత్యువాతపడ్డారు. మరో వ్యక్తికి గాయమైంది’ అని ప్రాంతీయ సమాచార డైరెక్టర్ నజీబుల్లా హసన్ అబ్దాల్ పేర్కొన్నారు.

సరిహద్దు ఖోస్ట్‌ ప్రావిన్స్‌లోనూ పాక్‌ ఇదే తరహా దాడికి పాల్పడినట్లు మరో అధికారి వెల్లడించారు. ‘ఖోస్ట్ ప్రావిన్స్‌లోని డ్యురాండ్ రేఖ సమీపంలోని నాలుగు గ్రామాలపై పాకిస్థాన్ హెలికాప్టర్లు బాంబు దాడి చేశాయి. పౌరుల నివాస గృహాలే లక్ష్యంగా పాక్‌ సైన్యం ఈ దాడులు చేస్తోంది’ అని అన్నారు. తాజా సంఘటనలపై అఫ్గాన్‌ విదేశాంగ శాఖ స్పందించింది. కాబుల్‌లోని పాకిస్థాన్‌ రాయబారిని పిలిపించి ఈ దాడుల గురించి నిరసన వ్యక్తం చేసినట్టు విదేశాంగ శాఖ తెలిపింది. అయితే దీనిపై పాకిస్థాన్‌ ఇంతవరకు పెదవి విప్పకపోవడం గమనార్హం.

గతేడాది ఆగస్టులో అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న అనంతరం ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు పెరిగిపోయాయి. ఇదే కాకుండా పొరుగుదేశం తమపై దాడులు చేస్తోందంటూ పాక్‌ పలుమార్లు ఆరోపించింది. అఫ్గాన్‌-పాక్‌ దేశాల మధ్య డ్యురాండ్‌ రేఖగా పిలిచే 2700 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని