Roscosmos: ‘లుహాన్స్క్‌’ స్వాధీనంపై అంతరిక్షంలోనూ సంబరాలు

ఉక్రెయిన్‌ లుహాన్స్క్‌ ప్రావిన్స్‌లోని చిట్టచివరి ప్రధాన నగరమైన లీసీచాన్స్క్‌నూ స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే విషయమై అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లో ఉన్న రష్యన్ వ్యోమగాములు...

Published : 05 Jul 2022 01:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌(Ukraine) లుహాన్స్క్‌ ప్రావిన్స్‌లోని చిట్టచివరి ప్రధాన నగరమైన లీసీచాన్స్క్‌నూ స్వాధీనం చేసుకున్నట్లు రష్యా(Russia) ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే విషయమై అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)లో ఉన్న రష్యన్ వ్యోమగాములు సోమవారం సంబరాలు చేసుకున్నారు. ఈ విజయాన్ని రష్యా అంతరిక్ష సంస్థ ‘రోస్‌కాస్మోస్’(Roscosmos).. ‘భూమితోపాటు రోదసిలోనూ ఉత్సవం చేసుకోగల విముక్తి దినం’గా అభివర్ణించింది. అక్కడి రష్యన్‌ కాస్మోనాట్స్ ఒలేగ్ ఆర్టెమియేవ్, డెనిస్ మాత్వివ్, సెర్గీ కోర్సకోవ్‌లు.. లుహాన్స్క్‌(Luhansk), దొనెట్స్క్‌ల జెండాలు పట్టుకుని దిగిన చిత్రాలను పంచుకుంది. ‘లుహాన్స్క్ ప్రాంతవాసులు ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్న రోజు ఇది. లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది’ అని రోస్‌కాస్మోస్ పేర్కొంది.

మరింత ముందడుగేయండి: పుతిన్‌

మరోవైపు ఉక్రెయిన్‌లో మాస్కో సేనల స్థితిగతులపై రష్యా అధినేత పుతిన్ సోమవారం రక్షణ మంత్రి సెర్గీ షోయిగును ఆరా తీశారు. యుద్ధభూమిలో మరింత ముందుకు సాగాలని ఆదేశించినట్లు సమాచారం. తూర్పు, పశ్చిమ బృందాలతోసహా మిలిటరీ యూనిట్లు గతంలో ఆమోదించిన ప్రణాళికల ప్రకారం ముందుకెళ్లాలని సూచించారు. లుహాన్స్క్‌లో సాధించిన మాదిరిగానే.. ఇకముందూ విజయాలు ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు లుహాన్స్క్‌లో పోరాడిన రష్యన్‌ సైనికులు విశ్రాంతి తీసుకోవాలని, వారి పోరాట సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలని చెప్పారు. తాజా విజయంతో డాన్‌బాస్‌ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలన్న లక్ష్యానికి మరింత చేరువైనట్లు రష్యా పేర్కొన్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని