Nobel Prize: భౌతిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురికి నోబెల్‌

భౌతిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్‌ బహుమతి ముగ్గుర్ని వరించింది. ఈ అవార్డును రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ మంగళవారం ప్రకటించింది.

Updated : 03 Oct 2023 19:04 IST

స్టాక్‌హోం: ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారాల (Nobel Prize) ప్రకటన కొనసాగుతోంది. భౌతిక శాస్త్రం (Physics)లో ఈ అవార్డును రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ మంగళవారం ప్రకటించింది. ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్‌ ముగ్గుర్ని వరించింది. అమెరికాకు చెందిన పెర్రీ అగోస్తిని, జర్మనీకి చెందిన ఫెరెన్స్‌ క్రౌజ్‌, స్వీడన్‌కు చెందిన అన్నె ఎల్‌ హ్యులియర్‌కు ఈ ఏడాది నోబెల్‌ ప్రకటించారు.

అణువుల్లో (Atoms) ఎలక్ట్రాన్‌ డైనమిక్స్‌ను అధ్యయనం చేసేందుకు.. కాంతి తరంగాల ఆటోసెకండ్‌ పల్స్‌ను ఉత్పత్తి చేసే పరిశోధనలకు గానూ వీరికి ఈ పురస్కారాన్ని అందజేస్తు్న్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ వెల్లడించింది. వీరి పరిశోధనలతో అణువులు, పరామణువుల్లోని ఎలక్ట్రాన్స్‌ (Electrons)ను అధ్యయనం చేసేందుకు మానవాళికి కొత్త సాధనాలు అందాయని పేర్కొంది.

కొవిడ్‌ టీకా యోధులకు నోబెల్‌

ఈ ఏడాది నోబెల్‌ పురస్కారాల ప్రకటన సోమవారం మొదలైంది. నిన్న వైద్య శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ ప్రకటించారు. కొవిడ్‌ మహమ్మారిపై పోరు కోసం సమర్థ ఎంఆర్‌ఎన్‌ఏ టీకాల అభివృద్ధికి మార్గం సుగమం చేసిన శాస్త్రవేత్తలు కాటలిన్‌ కరికో, డ్రూ వెయిస్‌మన్‌లను ఈ అవార్డు వరించింది. ఇక, బుధవారం రసాయనశాస్త్రం, గురువారం రోజున సాహిత్యం విభాగాల్లో గ్రహీతల పేర్లను ప్రకటిస్తారు. శుక్రవారం రోజున 2023 నోబెల్‌ శాంతి బహుమతి, అక్టోబర్‌ 9న అర్థశాస్త్రంలో నోబెల్‌ పురస్కార గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు. ఈ పురస్కారాలను ఈ ఏడాది డిసెంబరు 10న గ్రహీతలకు అందజేయనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని