Rupert Murdoch: 92ఏళ్ల వయసులో ‘ఐదో’ పెళ్లి..! ఇదే చివరిదన్న బిలియనీర్‌

బిలియనీర్‌ రూపర్ట్‌ మర్దోక్‌  (Rupert Murdoch) మరోసారి వివాహం చేసుకోనున్నారు. ఇప్పటికే నలుగురికి విడాకులు ఇచ్చిన ఆయన.. 92 ఏళ్ల వయసులో ఐదో వివాహం (Marriage) చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఇదే చివరి వివాహమని చెప్పడం గమనార్హం.

Updated : 21 Mar 2023 08:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మీడియా మొఘల్‌గా పేరుగాంచిన ఆస్ట్రేలియన్‌-అమెరికన్‌ వ్యాపారవేత్త రూపర్ట్‌ మర్దోక్‌ (Rupert Murdoch) మరోసారి వివాహం (Marriage) చేసుకునేందుకు సిద్ధమయ్యారు. తన ప్రియురాలు ఆన్‌ లెస్లీ స్మిత్‌తో ఎంగేజ్‌మెంట్‌ జరిగినట్లు వెల్లడించారు. ఇప్పటికే నలుగురితో విడాకులు (Divorce) తీసుకున్న ఆయన.. ఇది మాత్రం చివరి వివాహమని పేర్కొన్నారు. అయితే, నాలుగో భార్య జెర్రీ హాల్‌ నుంచి విడాకులు తీసుకున్న ఏడు నెలలకే మరో పెళ్లికి సిద్ధం కావడం గమనార్హం.

నాలుగో భార్య జెర్రీ హాల్‌తో గతేడాది ఆగస్టులోనే మర్దోక్‌ విడాకులు తీసుకున్నారు. అనంతరం కొన్ని రోజులకు మరోసారి ప్రేమలో పడిన ఆయన.. ప్రియురాలి ముందు పెళ్లి ప్రతిపాదన ఉంచినట్లు సమాచారం. అమెరికా మీడియా కథనాల ప్రకారం, మార్చి 17న న్యూయార్క్‌లో ఈ ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. ఆ సందర్భంగా ప్రియురాలి చేతికి రింగు తొడిగిన మర్దోక్‌.. ‘నేను ప్రేమలో పడటానికి భయపడ్డాను. కానీ, నాకు తెలుసు ఇదే నా  చివరి వివాహం అని. బాగుంటుందని ఆశిస్తున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది’ అని మర్దోక్‌ చెప్పినట్లు సమాచారం. మరోవైపు ఆన్‌ లెస్లీ స్మిత్‌ భర్త కూడా ఓ వ్యాపారవేత్త.. 14ఏళ్ల క్రితం ఆయన చనిపోయారు. మర్దోక్‌ చేసిన పెళ్లి ప్రతిపాదనకు అంగీకారం తెలిపిన ఆమె.. ఆయనతో జీవితం పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు.

న్యూస్‌కార్ప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, బిలియనీర్ అయిన మర్దోక్ 2016లో జెర్రీ హాల్‌ (65)ను వివాహం చేసుకున్నారు. తన కంటే 25 ఏళ్లు చిన్నదైన హాల్‌.. అమెరికన్ నటి, మోడల్‌. అంతకుముందు పాట్రిషియా బుకర్‌, అన్నా మరియా మన్‌, వెండీ డెంగ్‌తో మర్దోక్‌ విడాకులు తీసుకున్నారు. మర్దోక్‌ తన రెండో భార్య మన్‌ నుంచి విడిపోయిన సందర్భంలో చెల్లించిన భరణం అత్యంత ఖరీదైన భరణాల్లో ఒకటిగా నిలిచింది. ఆ సమయంలో ఆమెకు 1.7 బిలియన్‌ డాలర్ల ఆస్తి ఇచ్చినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని