Russia: రష్యా దుశ్చర్య.. ఉక్రెయిన్‌ అణువిద్యుత్ కేంద్రం హెడ్‌ ‘కిడ్నాప్‌’

జపోరిజియా అణు విద్యుత్‌ కేంద్రం డైరెక్టర్‌ జనరల్‌ ఇహోర్‌ మురాషోవ్‌ను రష్యా సేనలు కిడ్నాప్‌ చేశాయని ఉక్రెయిన్‌ ఆరోపించింది.

Published : 01 Oct 2022 14:02 IST

కీవ్‌: ఐరోపాలోనే అతిపెద్ద అణు కర్మాగారమైన ఉక్రెయిన్‌ జపోరిజియా న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్‌ ప్రస్తుతం రష్యా సేనల ఆధీనంలో ఉంది. అయితే ఈ అణు విద్యుత్‌ కేంద్రం డైరెక్టర్‌ జనరల్‌ ఇహోర్‌ మురాషోవ్‌ను క్రెమ్లిన్‌ అపహరించినట్లు ఉక్రెయిన్‌ తాజాగా ఆరోపించింది. శుక్రవారం సాయంత్రం మురాషోవ్‌ కారును అడ్డగించిన రష్యా సేనలు.. ఆయన కళ్లకు గంతలు కట్టి రహస్య ప్రాంతానికి తీసుకెళ్లినట్లు కీవ్‌ ప్రభుత్వ న్యూక్లియర్‌ ఏజెన్సీ ‘ఎనర్జోఆటమ్‌’ వెల్లడించింది.

మురాషోవ్‌ కిడ్నాప్‌.. జపోరిజియా అణు విద్యుత్‌ కేంద్రం భద్రతను ప్రమాదంలో పడేస్తుందని ఎనర్జోఆటమ్‌ ప్రెసిడింగ్‌ పెట్రో కొటిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అయితే మురాషోవ్‌ కిడ్నాప్‌పై అటు రష్యా నుంచి గానీ, అంతర్జాతీయ అణు విద్యుత్ ఏజెన్సీ నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు.

ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తోన్న యుద్ధంలో అనేక సార్లు ఈ జపోరిజియా ప్లాంట్‌ కేంద్రమైంది. ఈ అణువిద్యుత్‌ కేంద్రాన్ని మార్చిలోనే రష్యా సైన్యం స్వాధీనం చేసుకుంది. అయితే ఇందులో నిర్వహణ మాత్రం ఉక్రెయిన్‌ న్యూక్లియర్‌ ఏజెన్సీ ఎనర్జోఆటమ్‌ చేపట్టింది. ఈ కేంద్రంపై రష్యా దాడులు జరపడంతో అనేక గ్రిడ్‌లు దెబ్బతిన్నాయి. వరుస దాడులతో పెను ముప్పు పొంచి ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేయడంతో గత నెలలో చివరి రియాక్టర్‌ను నిలిపివేసి ప్లాంట్‌ను పూర్తిగా మూసేశారు. ప్రస్తుతం అక్కడ కూలింగ్ ప్రక్రియ జరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని