Kremlin Drone Attack: బంకర్‌లోకి పుతిన్‌.. అమెరికాకు రష్యా స్ట్రాంగ్‌ వార్నింగ్‌

క్రెమ్లిన్‌పై డ్రోన్ల దాడికి జరిగిన యత్నాలు.. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి. ఈ ఘటన తర్వాత రష్యా.. అమెరికా, ఉక్రెయిన్‌లపై తీవ్రంగా విరుచుకుపడింది. (Kremlin Drone Attack) 

Updated : 04 May 2023 18:43 IST

మాస్కో: రష్యా రాజధాని నగరం మాస్కో నడిబొడ్డున క్రెమ్లిన్‌(Kremlin) భవనాలపై రెండు డ్రోన్లు దూసుకురావడం తీవ్ర కలకలం సృష్టించింది. అధ్యక్ష కార్యాలయం, నివాసం ఉన్న ఈ కీలక భవనాలపై ఈ తరహా దాడికి యత్నం జరగడంతో రష్యా(Russia) ఉలిక్కిపడింది. దీనిపై రష్యా అగ్రదేశం అమెరికాను తీవ్రంగా విమర్శించింది. క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌( Dmitry Peskov) తీవ్ర ఆరోపణలు చేశారు. (Kremlin Drone Attack)

‘ఎక్కడెక్కడ దాడి చేయాలో ఆ లక్ష్యాలను అమెరికా ఎంపిక చేస్తుంది. వాటిని ఉక్రెయిన్ అమలు చేస్తోంది. ఆ యత్నాల గురించి రష్యాకు తెలుసని వాషింగ్టన్‌ తెలుసుకోవాలి. వీటన్నింటికీ ప్రతీకారం తీర్చుకునే హక్కు రష్యాకు ఉంది. రష్యా దగ్గర చాలా ఆప్షన్లు ఉన్నాయి. ప్రస్తుత దాడిపై తక్షణ విచారణ జరుగుతోంది’ అని అమెరికాకు పెస్కోవ్‌ హెచ్చరికలు చేశారు. 

ఇదిలా ఉంటే.. క్రెమ్లిన్‌పై జరిగిన డ్రోన్‌ దాడిని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ తీవ్రంగా ఖండించింది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Ukraine president zelensky), అతడి గుంపును చంపడం మినహా తమ వద్ద మరో అవకాశం లేదని కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రీ మెద్వదేవ్‌ మీడియాతో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘జెలెన్‌స్కీ బేషరతుగా లొంగిపోయే పత్రంపై సంతకం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడూ ఏదో ఒక ప్రత్యామ్నాయం ఉంటుంది’ అని మండిపడ్డారు. 

బంకర్‌లోకి పుతిన్‌

క్రెమ్లిన్‌పై రెండు డ్రోన్లు దాడికి యత్నించడంతో అధ్యక్షుడి భద్రతా సిబ్బంది మరింత అప్రమత్తమైంది. దాంతో పుతిన్‌ను బంకర్‌లోకి తరలించారు. ఆయనకు చెందిన నోవో-ఒగరెవో ప్రాంతంలోని నివాసంలో ఈ బంకర్‌ను నిర్మించారు. అధ్యక్షుడు అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తారని స్థానిక మీడియా వెల్లడించింది. మరోపక్క ఉక్రెయిన్‌లోని చిన్నారులను రష్యా అపహరించుకుపోయిందన్న ఆరోపణలపై కొద్దినెలల క్రితం పుతిన్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం(ICC) అరెస్టు వారెంట్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ న్యాయస్థానాన్ని జెలెన్‌స్కీ సందర్శించడం గమనార్హం. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని