Darya Dugina: కారు బాంబుపేలుడు ఘటన.. ఆ పని ఉక్రెయిన్‌దే!

రష్యా(Russia) అధ్యక్షుడు పుతిన్‌(Putin) ఆంతరంగికుడు అలెగ్జాండర్‌ దుగిన్‌ కుమార్తె డారియా దుగినా(Darya Dugina).. మాస్కో(Moscow)లో....

Updated : 22 Nov 2022 14:53 IST

ఆరోపించిన రష్యా భద్రతాసంస్థ ఎఫ్‌ఎస్‌బీ

మాస్కో: రష్యా(Russia) అధ్యక్షుడు పుతిన్‌(Putin) ఆంతరంగికుడు అలెగ్జాండర్‌ దుగిన్‌ కుమార్తె డారియా దుగినా(Darya Dugina).. మాస్కో(Moscow)లో జరిగిన కారు బాంబు పేలుడులో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, దీని వెనుక ఉక్రెయిన్‌ స్పెషల్‌ సర్వీసెస్‌(Ukraine special services) హస్తం ఉందని రష్యా భద్రతాసంస్థ ‘ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీసెస్(FSB)‌’ సోమవారం ఆరోపించినట్లు స్థానిక వార్తాసంస్థలు తెలిపాయి. 1979లో జన్మించిన ఓ ఉక్రెయిన్‌ మహిళ ఈ దాడికి పాల్పడిందని, ఉక్రెయిన్‌ స్పెషల్‌ సర్వీసెస్‌ ఆమెను నియమించిందని ఎఫ్‌ఎస్‌బీ పేర్కొంది.

‘ఆ మహిళ, ఆమె కుమార్తె జులైలో రష్యాకు చేరుకున్నారు. దుగినా నివాసం ఉంటున్న హౌసింగ్ బ్లాక్‌లోనే ఓ అపార్ట్‌మెంట్‌ అద్దెకు తీసుకుని.. నెలరోజుల పాటు దాడికి సిద్ధమయ్యారు. ఈ సమయంలోనే డారియా జీవనశైలిని పరిశీలించారు’ అని ఎఫ్‌ఎస్‌బీ ఒక ప్రకటనలో తెలిపింది. పేలుడు ఘటనకు ముందు డారియా, ఆమె తండ్రి అలెగ్జాండర్‌ దుగిన్‌ హాజరైన కార్యక్రమంలో ఆ మహిళ కూడా పాల్గొందని వెల్లడించింది. ఘటనానంతరం ఆమె రష్యా నుంచి ఎస్తోనియా పారిపోయిందని ఆరోపించింది. అయితే, ఉక్రెయిన్‌ ఈ ఆరోపణలను ఖండించింది.

ఇదిలా ఉండగా.. పుతిన్‌ గురువుగా దుగిన్‌కు పేరుంది. ఆయన సలహాతోనే ఉక్రెయిన్‌పై పుతిన్‌ సైనిక చర్య ప్రారంభించారని అంటారు. వాస్తవానికి తండ్రి, కుమార్తె ఒకే కారులో ఇంటికి వెళ్లాలి. చివరి నిమిషంలో వేరే కారులోకి మారడంతో ఆయనకు ముప్పు తప్పింది. 29 ఏళ్ల డారియా పాత్రికేయురాలు. ఆమె కూడా యుద్ధాన్ని సమర్థిస్తూ వ్యాసాలు రాశారు. తండ్రీ కుమార్తెలిద్దరూ అమెరికా ఆంక్షల జాబితాలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని