Russia: రష్యాలో ఐఫోన్లపై అమెరికా ‘హ్యాకింగ్‌’..!

తమ దేశంలో పౌరులు వినియోగిస్తున్న ఐఫోన్లను హ్యాక్‌ (Hacking) చేసి అమెరికా (USA) గూఢచర్యానికి పాల్పడుతోందని రష్యా (Russia) ఆరోపించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

Published : 02 Jun 2023 13:14 IST

మాస్కో: అగ్రరాజ్యం అమెరికా (USA)పై రష్యా (Russia) సంచలన ఆరోపణలు చేసింది. తమ దేశంలో ఐఫోన్ల (iPhones)పై యూఎస్‌ నిఘా పెట్టిందని, అధునాతన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఆ ఫోన్లను హ్యాక్‌ చేసిందని మాస్కో ఆరోపించింది. అమెరికా పాల్పడిన ఈ గూఢచర్య ఆపరేషన్‌ను తాము గుర్తించినట్లు రష్యా ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీస్‌ (FSB) తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది.

‘‘యాపిల్‌ (Apple) మొబైల్‌ ఫోన్లతో అమెరికన్‌ స్పెషల్‌ సర్వీసెస్‌ సాగిస్తున్న గూఢచర్యాన్ని ఎఫ్‌ఎస్‌బీ గుర్తించింది. దేశీయంగా రష్యన్లు ఉపయోగించే ఐఫోన్లతో పాటు.. రష్యా, ఒకప్పటి సోవియట్‌ యూనియన్‌ దేశాల్లో పనిచేస్తున్న విదేశీ దౌత్యవేత్తల యాపిల్‌ ఫోన్లను కూడా హ్యాక్‌ (Hacking) చేశారు. అమెరికా జాతీయ భద్రతా ఏజెన్సీ (NSA), యాపిల్‌ సంస్థల సంయుక్త సహకారంతో ఈ గూఢచర్యం జరుగుతోంది’’ అని రష్యా (Russia) ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీస్‌ తమ ప్రకటనలో పేర్కొంది. అయితే, దీనికి సంబంధించిన సాక్ష్యాలను మాత్రం ఎఫ్‌ఎస్‌బీ (FSB) వెల్లడించలేకపోయింది.

అటు, మాస్కోకు చెందిన కాస్పర్‌స్కీ ల్యాబ్‌ కూడా ఈ హ్యాకింగ్‌పై ఓ ప్రకటన చేసింది. ‘‘ఈ నిఘా ఆపరేషన్‌లో భాగంగా మా కంపెనీకి చెందిన పదుల సంఖ్యలో ఉద్యోగుల ఫోన్లను హ్యాక్‌ చేశారు. ఇందులో ఉన్నత హోదాల్లో పనిచేసే ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇది అత్యంత కచ్చితంగా ప్రయోగించిన సైబర్‌దాడే’’ అని కాస్పర్‌స్కీ సీఈవో ట్విటర్‌లో వెల్లడించారు. అయితే ఇది అమెరికానే చేసిందని తాము స్పష్టంగా చెప్పలేమని ఆయన పేర్కొనడం గమనార్హం.

అయితే, ఈ ఆరోపణలను యాపిల్‌ (Apple) తీవ్రంగా ఖండించింది. ‘‘మా యాపిల్ ఉత్పత్తుల్లో నిఘా సాఫ్ట్‌వేర్‌ను జొప్పించేందుకు మేం ఎన్నడూ ఏ ప్రభుత్వంతో కలిసి పనిచేయలేదు. అలా చేయబోం కూడా’’ అని సంస్థ స్పష్టం చేసింది. మరోవైపు, దీనిపై స్పందించేందుకు అమెరికా ఎన్‌ఎస్‌ఏ (NSA) నిరాకరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని